G-20 Delhi : సదస్సుకు సిద్ధమవుతున్న సరికొత్త ఢిల్లీ!

G-20 Delhi : సదస్సుకు సిద్ధమవుతున్న సరికొత్త ఢిల్లీ!
G-20 Delhi : సదస్సుకు సిద్ధమవుతున్న సరికొత్త ఢిల్లీ!




మన దేశానికి రానున్న ప్రపంచ అధినేతలను స్వాగతించేందుకు జీ-20 వేదికైన రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. అగ్రదేశాల అధినేతల నేతల కోసం హోటళ్లన్నీ బుక్‌ అయిపోయాయి. చైనా అగ్రనేత జీ జిన్‌పింగ్‌ కోసం తాజ్‌ ప్యాలెస్, జో బైడెన్‌ కోసం ఐటీసీ మౌర్యా, రిషి సునాక్ కోసం షాంగ్రిలా సిద్ధం చేశారు. ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి అగ్రదేశాలకు చెందిన ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. అలాగే అతి క్లిష్టమైన సవాళ్లను సైతం అతి సునాయాసంగా అధిగమించే హిట్‌ టీమ్‌లను రంగంలోకి దించారు.


ఢిల్లీలో బస చేసే అగ్రనేతల హోట ళ్లు, జీ-20 సదస్సు జరిగే ప్రాంగణాల లోపలి భాగాలు ఈ టీమ్‌ల నిఘాలో ఉంటాయి. ఎన్నికల ఏడాదిలో జీ-20కి సారథ్యం వహించే అవకాశం రావడంతో, సదస్సు నిర్వహణను మోదీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అలాగే విదేశీ భద్రతా సంస్థలకు చెందిన కమాండోలు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఢిల్లీకి చేరుకుంటారు. బైడెన్‌ సెక్యూరిటీ టీమ్‌ మూడు రోజుల ముందు ఢిల్లీ చేరుకోనుంది. భద్రతా ఏర్పాట్ల గురించి కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.


దక్షిణ ఢిల్లీ గ్రేటర్‌ కైలాశ్‌ ప్రాంతంలోని మునిసిపల్‌ పార్కులో భారీ మెటాలిక్‌ జీ-20 లోగోను ఏర్పాటు చేశారు. పార్కు మధ్యలో సభ్యదేశాల జెండాలను సుందరంగా అలంకరించారు. సర్దార్ పటేల్ మార్గ్, మదర్ థెరిసా క్రెసెంట్, తీన్ మూర్తి మార్గ్, ధౌలా క్వాన్-ఐజిఐ ఎయిర్‌పోర్ట్ రోడ్, పాలం టెక్నికల్ ఏరియా, ఇండియా గేట్ సి-హెక్సాగాన్, మండి హౌస్, అక్బర్ రోడ్ రౌండ్‌అబౌట్ వంటి ప్రదేశాలను కుండీలతో కూడిన మొక్కలతో G20 సమ్మిట్ కోసం అందంగా తీర్చిదిద్దారు.



జీ20 సదస్సుకు వచ్చే విదేశీ అతిథులకు కోతుల బెడద లేకుండా ఎన్‌ఎండీసీ(న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌), అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నాయి. కొండముచ్చుల్లా శబ్దాలు చేస్తూ కోతులను తరిమేసేందుకు శిక్షణ పొందిన 30-40 మందిని నియమిస్తున్నట్టు సమాచారం . సదస్సు దృష్ట్యా వచ్చే నెల 8 నుంచి మూడ్రోజుల పాటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మూడు రోజులూ లుటియన్స్‌ ఢిల్లీలోని అన్ని మాల్స్, మార్కెట్లను మూసి ఉంచాలన్న పోలీసు శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ సక్సేనా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story