Elections : ఉపరాష్ట్రపతి ఎన్నికలపై సుదర్శన్ రెడ్డి హాట్ కామెంట్స్

ఉపరాష్ట్రపతి ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చను లేవనెత్తాయి. క్రాస్ ఓటింగ్ అంశంపై విపక్ష కూటమిలో అలజడి మొదలైంది. ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. అయితే, కూటమిల వాస్తవ సంఖ్యా బలం కంటే ఎన్డీఏకు 14 ఓట్లు ఎక్కువ రావడం ప్రతిపక్ష కూటమిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే వాదనకు బలం చేకూర్చింది.
ఈ నేపథ్యంలో...ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పందించారు.ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన ఆయన...క్రాస్ ఓటింగ్ గురించి తాను మాట్లాడబోనని, దేశ ప్రజలందరూ ఏం జరిగిందో చూశారని అన్నారు. పదవుల కోసం పార్టీల్లో చేరడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కొన్ని ఓట్లు చెల్లకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు.
ఇదిలా ఉండగా, త్వరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ, ఇండియా కూటమిలో క్రాస్ ఓటింగ్ అంశం కూటమి ఐక్యతను మరోసారి ప్రశ్నార్థకం చేసింది. ముఖ్యంగా టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలను టార్గెట్ చేశాయి. ఆర్జేడీ, జేఎంఎం, శివసేన యూబీటీ పార్టీల ఎంపీలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలను మరింత ఇరుకున పెట్టాయి. "మనస్సాక్షితో ఓటు వేసిన ఇండియా బ్లాక్ ఎంపీలకు ప్రత్యేక కృతజ్ఞతలు" అని చేసిన వ్యాఖ్యలు కూటమిలో చిచ్చు రాజేశాయి. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించాలని రాహుల్ గాంధీ పట్టుదలతో ఉన్న నేపథ్యంలో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ క్రాస్ ఓటింగ్ వ్యవహారం ఇండియా కూటమికి కొత్త తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com