Sukanya Samriddhi Yojana : చరిత్రలోనే అత్యధిక వడ్డీ..ఆడపిల్లల భవిష్యత్తు మార్చేసే ఏకైక ప్రభుత్వ పథకం ఇదే.

Sukanya Samriddhi Yojana : షేర్ మార్కెట్ ఒడిదుడుకులు, బంగారం ధరల పెరుగుదల వంటి అంశాల మధ్య సామాన్య పెట్టుబడిదారులు తమ డబ్బును ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక సతమతమవుతుంటారు. ముఖ్యంగా కూతురు ఉన్న తల్లిదండ్రులకు ఆమె చదువు, పెళ్లి వంటి భవిష్యత్తు అవసరాల కోసం భారీగా నిధులు అవసరమవుతాయి. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకమే సుకన్య సమృద్ధి యోజన. ఇది కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు, మీ చిన్నారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భరోసా. మార్కెట్ నష్టాల భయం లేకుండా, దీర్ఘకాలంలో కోటీశ్వరులను చేసే సత్తా ఉన్న స్కీమ్ ఇది.
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజనపై ప్రభుత్వం ఏడాదికి 8.2% వడ్డీని అందిస్తోంది. సాధారణ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్ల కంటే ఇది చాలా ఎక్కువ. ఈ పథకంలో ప్రధాన ఆకర్షణ కాంపౌండింగ్. అంటే మీరు జమ చేసే అసలుకే కాకుండా, దానికి వచ్చే వడ్డీపై కూడా మళ్ళీ వడ్డీ వస్తుంది. దీనివల్ల 21 ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి మీరు ఊహించని విధంగా భారీ నిధి మీ చేతికి అందుతుంది. మీ కూతురు పెద్దయ్యాక ఉన్నత చదువులకో లేదా ఘనంగా పెళ్లి చేయడానికో ఈ సొమ్ము కొండంత అండగా నిలుస్తుంది.
మీ కూతురి వయస్సు 10 ఏళ్లలోపు ఉంటే చాలు, ఈ పథకంలో చేరవచ్చు. తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు పాప పేరు మీద ఈ ఖాతాను తెరవాలి. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరు మీద మాత్రమే ఈ అకౌంట్లు తెరవడానికి వీలుంటుంది. మీరు మీ సమీపంలోని పోస్టాఫీసులో లేదా ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంకులో చాలా సులభంగా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. దీని కోసం పాప పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్, పాన్ కార్డు, ఫోటోలు ఉంటే సరిపోతుంది.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. మీరు ఏడాదికి కనిష్టంగా రూ.250 తో కూడా అకౌంట్‌ను కొనసాగించవచ్చు. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. మీరు నెలకు ఇంత అని కాకుండా, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు సంవత్సరంలో ఎప్పుడైనా జమ చేయవచ్చు. ఖాతా తెరిచిన నాటి నుంచి 15 ఏళ్ల వరకు మీరు డబ్బు జమ చేయాలి. ఆ తర్వాత 21వ ఏట ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఒకవేళ పాపకు 18 ఏళ్లు నిండిన తర్వాత పైచదువుల కోసం డబ్బు అవసరమైతే, ఖాతాలోని నిధుల నుండి 50 శాతం వరకు వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
సుకన్య సమృద్ధి యోజన EEE కేటగిరీ కిందకు వస్తుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టే సొమ్ముపై ఆదాయపు పన్ను చట్టం 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే దీనిపై వచ్చే వడ్డీకి, మెచ్యూరిటీ తర్వాత పొందే మొత్తం సొమ్ముకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ స్కీమ్. ఒక రకంగా చెప్పాలంటే, మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇస్తున్న ఒక గొప్ప వరం ఈ సుకన్య సమృద్ధి యోజన. ఇప్పటికీ మీరు ఈ ఖాతా తెరవకపోతే, తక్షణమే ఆలోచించి మీ చిన్నారి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయడం మంచిది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
