Justice Vikram Nath: వీధి కుక్కల కేసు.. నన్ను ఫేమస్ చేసింది

ఇప్పటివరకు తాను న్యాయవాద వర్గాల్లో మాత్రమే సుపరిచితుడినని, కానీ వీధికుక్కలకు సంబంధించిన కేసు కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ తెలిశానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ కేసును తనకు అప్పగించినందుకు భారత ప్రధాన న్యాయమూర్తికి (సీజేఐ) ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కేరళలోని తిరువనంతపురంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ విక్రమ్ నాథ్ ప్రసంగించారు. జాతీయ న్యాయ సేవల అథారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ), కేరళ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ (కేఈఎల్ఎస్ఏ) సంయుక్తంగా 'మానవ-వన్యప్రాణి సంఘర్షణ' అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్ మాట్లాడుతూ "ఇటీవల న్యాయవాదుల సంఘాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో చాలామంది నన్ను వీధికుక్కల కేసు గురించే అడిగారు. శునక ప్రేమికులతో పాటు, శునకాలు కూడా నాకు తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు పంపుతున్నాయని నాకు సందేశాలు వస్తున్నాయి. మనుషుల దీవెనలతో పాటు ఇప్పుడు వాటి దీవెనలు కూడా నాకు ఉన్నాయి" అని చమత్కరించారు.
ఢిల్లీలోని వీధికుక్కలను పట్టుకుని ఎనిమిది వారాల్లోగా వాటి కోసం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆగస్టు 11న జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై జంతు ప్రేమికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈ కేసును జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. ఆగస్టు 22న జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం పాత ఆదేశాలను సవరించింది. పట్టుకున్న కుక్కలకు వ్యాక్సిన్లు, నులిపురుగుల మందులు ఇచ్చి తిరిగి వాటిని షెల్టర్ల నుంచి విడిచిపెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com