Supreme Court: ఇసుక అక్రమ తవ్వకాలు.. గత నివేదికలపై అనుమానాలున్నాయ్‌:

Supreme Court: ఇసుక అక్రమ తవ్వకాలు.. గత నివేదికలపై అనుమానాలున్నాయ్‌:
ఇసుక తవ్వకాలపై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో అధికారులు ఇచ్చిన నివేదికలపై అనుమనాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో అక్రమ తవ్వకాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. గతంలో అధికారులిచ్చిన సమాచారం మేరకు అఫిడవిట్‌ దాఖలు చేశామన్న కొత్త ప్రభుత్వం వాటన్నింటిని పునఃపరిశీలించి తనిఖీలు జరుపుతున్నట్లు కోర్టుకు వివరించింది.

గతంలో అధికారుల నివేదికల్లో వాస్తవాలు వెల్లడించలేదని మీడియాలో కూడా వార్తలొచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నివేదికలన్నీ పునఃపరిశీలించి ఆధారాలతో వివరాలు సేకరిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలన్నీ కోర్టు ముందు ఉంచుతామని ఇందుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించేందుకు తమకూ సమయం కావాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వివరించింది.

ఇప్పటికే 7 జిల్లాల్లో తనిఖీలు జరిపి నివేదికను కోర్టు ముందుంచామని, మిగిలిన జిల్లాల్లోనూ తనిఖీలు జరిపేందుకు 6 వారాల సమయం కావాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. సమయమిచ్చేందుకు సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. అటు ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై తాము దాఖలు చేసిన ఆధారాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్‌ దండా నాగేంద్రకుమార్‌ సుప్రీంకోర్టును కోరారు. పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది.

Tags

Next Story