Supreme Court : వీధి కుక్కల ఇష్యూపై సుప్రీం కీలక తీర్పు..

Supreme Court : వీధి కుక్కల ఇష్యూపై సుప్రీం కీలక తీర్పు..
X

వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు తన గత తీర్పును సవరించింది. వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసి, వాటిని పట్టుకున్న ప్రదేశంలోనే తిరిగి వదిలేయాలని అత్యున్నత న్యాయస్థానం తన తాజా తీర్పులో ఆదేశించింది. ఆగస్టు 11న ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్కడి నుంచి కుక్కలను తీసుకెళ్ళినా, స్టెరిలైజ్ చేసిన తర్వాత వాటిని అక్కడే తిరిగి వదిలివేయాలని కోర్టు పేర్కొంది. వీధి కుక్కలను షెల్టర్లలో ఉంచడం వల్ల అవి కిక్కిరిసిపోయాయని, దీని వల్ల కుక్కల ఆరోగ్యం ఆందోళనకరంగా మారినట్లు కోర్టు వెల్లడించింది. వ్యాక్సినేషన్ తర్వాత మాత్రమే కుక్కలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. దూకుడు ప్రవర్తన ఉన్న కుక్కలను లేదా రేబిస్ వ్యాధితో బాధపడుతున్న కుక్కలను బహిరంగ ప్రదేశాల్లో వదలవద్దని, వాటిని డాగ్ షెల్టర్లలోనే ఉంచాలని కోర్టు తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం అందించడాన్ని నిషేధించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. వీటికి ఆహారం అందించడానికి నిర్దిష్ట ప్రదేశాలను ఏర్పాటు చేయాలని సూచించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

Tags

Next Story