Supreme Court : కోల్కతా డాక్టర్ ఫోటో, వివరాలు తొలగించండి : సుప్రీంకోర్టు

కోల్కతా ఆర్ జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ ఫోటో, ఆమె వివరాలను వెంటనే తొలగించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వికీపీడియాను ఆదేశించింది. ఆర్ జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య చేసిన ఘటన కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తుంది. ఈ రోజు కేసు విచారణలో భాగంగా వికీపీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి గుర్తింపును ఏ విధంగా బహిర్గతం చేయకూడదని, బాధితురాలి ఫోటో, ఆమె గుర్తింపుకు సంబంధించి ఏదైనా కంటెంట్ ఉన్నా వెంటనే తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వికీపీడియాను ఆదేశించింది. అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల గుర్తింపును వెల్లడించలేమని, వికీపీడియా తప్పనిసరిగా అలాంటి సూచనలను తొలగించాలని, ఇందుకు సంబంధించి భారత చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఘటన తర్వాత బాధితురాలి ఫోటోలో ఆన్ లైన్ లో షేర్ చేయబడ్డాయని, ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com