Suresh Gopi : మరో వివాదంలో సురేశ్ గోపి.. వృద్ధురాలితో దురుసు ప్రవర్తన

కేంద్ర పర్యాటకశాఖ సహాయమంత్రి సురేశ్ గోపి ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నారు. తన నియోజకవర్గమైన త్రిశ్శూర్‌లో పర్యటిస్తున్నప్పుడు ఓ వృద్ధురాలితో ఆయన దురుసుగా మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరువన్నూర్ సహకార బ్యాంకు కుంభకోణం బాధితురాలైన ఆనందవల్లి అనే మహిళ మంత్రిని కలిసి, తన డిపాజిట్ సొమ్మును తిరిగి ఇప్పించడంలో సహాయం చేయాలని కోరారు. అయితే సురేశ్ గోపి ఆ అభ్యర్థనను తోసిపుచ్చడమే కాకుండా ‘‘వెళ్లి మీ మంత్రికో, ముఖ్యమంత్రికో చెప్పు. ఎక్కువగా మాట్లాడవద్దు’’ అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆశ్చర్యపోయిన ఆ మహిళ, ‘‘మీరు కూడా మా మంత్రే’’ అని బదులిచ్చారు. అప్పుడు సురేశ్ గోపి ‘‘నేను దేశానికి మంత్రిని’’ అని బదులివ్వడం మరింత చర్చకు దారితీసింది. ఈ ఉదంతం వీడియో వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తమ డిపాజిట్లు తిరిగి ఇప్పిస్తానని సురేశ్ గోపి హామీ ఇచ్చారని ఆనందవల్లి మీడియాకు తెలిపారు. ఆయన దురుసుగా మాట్లాడకుండా తన అభ్యర్థనను పరిశీలిస్తానని చెప్పినా సరిపోయేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇది సురేశ్ గోపికి ఇటీవల కాలంలో రెండో వివాదం. గతంలో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వృద్ధుడి వినతిపత్రాన్ని తిరస్కరించి ఆయన విమర్శలపాలయ్యారు. అప్పుడు కూడా అమలు చేయలేని హామీలు ఇవ్వనంటూ తన వైఖరిని సమర్థించుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com