Suresh Kalmadi: కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూత..!!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ (81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పుణెలోని తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు ఎరండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం సాయంత్రం 3:30 గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడీ మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
పైలట్ నుంచి రాజకీయ నేతగా సురేశ్ కల్మాడీ
భారత వాయుసేనలో పైలట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన సురేశ్ కల్మాడీ, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఒక దశలో పుణె రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా, 'కింగ్‌మేకర్'గా ఆయనకు పేరుండేది.
క్రీడారంగంలోనూ కల్మాడీ కీలక పాత్ర
రాజకీయాలతో పాటు క్రీడారంగంలోనూ కల్మాడీ కీలక పాత్ర పోషించారు. భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ, ఆ తర్వాత కొన్ని వివాదాలు ఆయన రాజకీయ జీవితంపై ప్రభావం చూపాయి. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు కల్మాడీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. ఈ కేసులో 2011లో ఆయన అరెస్ట్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. అనంతరం 2016లో ఆయనను ఐఓఏ జీవితకాల అధ్యక్షుడిగా నియమించినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పదవిని తిరస్కరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

