Suspension : పూజా ఖేద్కర్ ట్రైనింగ్‌కు బ్రేక్.. ముస్సోరిలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు

Suspension : పూజా ఖేద్కర్ ట్రైనింగ్‌కు బ్రేక్.. ముస్సోరిలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
X

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించడం వంటి ఆరోపణలతో పూజా ఖేద్కర్ గతకొన్ని రోజులు గా వార్తల్లో నిలిచారు. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమె విషయంలో ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీలోగా ముస్సోరిలోని అకాడమీలో రిపోర్టు చేయాలని ఆమెను ఆదేశించారు.

అడ్డదారుల్లో ఐఏఎస్ ఉద్యోగం పొందారని పూజా ఖేద్కర్ పై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. పూజా ఖేడ్కర్ శిక్షణను తక్షణమే నిలిపేస్తున్నామని, ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో మహారాష్ట్రలోని జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజను రిలీవ్ చేస్తున్నట్లు మహారాష్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. పూజ వ్యవహారశైలిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో పుణె నుంచి ఆమెను వాసిమ్ కు బదిలీ చేశారు. ఆ తర్వాత కూడా ఈ నిర్ణయం వెలువడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

మరోవైపు ఐఏఎస్ కు ఎంపిక సమయంలో ఆమె దాఖలు చేసిన వైద్య ధ్రువీ కరణపత్రాల ప్రామాణికతపై పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ పత్రాలతో దివ్యాంగుల కోటా కింద ఆమె లబ్ధి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. యూపీఎస్సీకి సమర్పించిన పలు ధ్రువీకరణ పత్రాల్లో అంధత్వానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే ఓబీసీ కోటా కూడా వాడుకున్నారని, పోస్టింగ్ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. ఇలా ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పలుమార్లు పేరు మార్చుకుని సివిల్స్ పరీక్ష రాసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఆమె సమర్పంచిన నాన్ క్రిమీలే యర్ సర్టిఫికేట్ కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రొబేషన్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Next Story