నారీశక్తికి ప్రతీక ఈ మధ్యంతర బడ్జెట్-ప్రధాని మోడీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తాయి. ఈ సెషన్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitaraman) ఫిబ్రవరి 1న అంటే రేపు మద్యేతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమర్పణ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రతిస్పందనలు ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈసారి ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని అన్నారు. దేశం దినదినాభివృద్ధి చెందుతోందని, కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని మోదీ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని, ఆ తర్వాత సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రధాన మంత్రి అన్నారు. ఇప్పుడు అంతా మహిళా శక్తిపైనే ఆధారపడి ఉందన్నారు. కొత్త పార్లమెంట్ భవనం మొదటి సమావేశంలో, మేము నారీ శక్తి వందన్ కోసం మహిళలకు రిజర్వేషన్‌ను ఆమోదించాము. తరువాత, మొన్న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీ శక్తిని ప్రపంచానికి పరిచయం చేసాము. ఇప్పుడు కూడా రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇదంతా మహిళా శక్తికి ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.
మోదీ ప్రసంగం చివర్లో ‘రామ్ రామ్...’
అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ రామ్ రామ్ అంటూ ముగించారు. ప్రధాని మోదీ ఇలా చెప్పడం ఇదే తొలిసారి. ఎప్పుడూ జరగని ఇలా ప్రధాని ఎందుకు చెప్పారని ఇప్పుడు మీడియా చర్చిస్తోంది. ఇది అయోధ్య రామమందిర ప్రభావమా లేక బడ్జెట్‌లో రాముడికి సంబంధించిన అంశాలను కూడా చేర్చే సూచన ఉందా అనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు అయోధ్య రామమందిరాన్ని ప్రారంభించడంతో... యావత్ భారతావని రామభక్తిలో మునిగిపోయింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇదే చివరి బడ్జెట్ కావడంతో మళ్లీ రామభక్తిని ఆయుధంగా చేసుకుని ప్రజలను ఆకర్షిస్తారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com