Tamil Nadu: ఇండియా’ గెలిస్తే తమిళనాడులో ‘నీట్’ రద్దు - స్టాలిన్‌

Tamil Nadu:  ఇండియా’ గెలిస్తే తమిళనాడులో ‘నీట్’ రద్దు - స్టాలిన్‌
నీట్‌' నుంచి మినహాయింపు ఇచ్చేవరకు పోరాటం ఆగదన్న తమిళనాడు సీఎం స్టాలిన్‌

నీట్‌ పరీక్షలో తమ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేవరకు తమ పోరాటం ఆగదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి గెలిచి అధికారం చేపడితే రాష్ట్రంలో ‘నీట్’ ఉండదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ‘నీట్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే యువజన విభాగం నిన్న ఒక్కేరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు చేపట్టింది. ఈ ఒక్క రోజు దీక్షను మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. నీట్ రద్దు కోసం డీఎంకే చేస్తున్న పోరాటం రాజకీయ అభ్యర్థన కాదని, సామాజిక సమానత్వ విద్య కోరుకునే తమిళనాడు ప్రజల డిమాండ్ అని పేర్కొన్నారు. నిరాహారదీక్షలను విజయవంతం చేసిన వారికి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా నీట్‌ వ్యతిరేక బిల్లుకు తాను ఎప్పటికీ సంతకం చేయనని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఇటీవల పేర్కొనడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని.. ఇటువంటి సమయంలో గవర్నర్‌ వ్యాఖ్యలు అనవసరమన్నారు. నీట్‌ రద్దును కోరుతూ తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధితోపాటు ఇతర మంత్రుల నేతృత్వంలో అధికార డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.


ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ, రాష్ట్రంలో చేపట్టిన ఈ నిరసనలు ఇక్కడితో ఆగవన్నారు. ఇప్పటివరకు 21మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని.. దీనికి వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలోనూ ఉద్యమిస్తామన్నారు. విద్యార్థుల ప్రాణాలు బలిగొంటున్న నీట్‌ను రద్దు చేయాలని, లేదంటే తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇదే డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ ఇంటి ముందు ధర్నా చేద్దామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామికి ఆయన విజ్ఞప్తి చేశారు. మధురై మినహా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో.. నీట్‌ వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో డీఎంకే యువజన, విద్యార్థి, వైద్యుల విభాగాలతోపాటు డీఎంకే కార్యకర్తలు సైతం పాల్గొన్నారు.

అన్నాడీఎంకే భారీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్న మధురైలో మినహా రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నిరాహార దీక్షలు జరిగాయి. ఇంతకీ నీట్ పరీక్షకు మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత అత్యధిక దరఖాస్తులు వస్తున్నది తమిళనాడు నుంచే.దీనితరువాత అత్యధిక అప్లికేషన్లు యూపీ నుంచి అందుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story