TOMATO: ప్రభుత్వ దుకాణాల్లో టమాటాల విక్రయం

దేశవ్యాప్తంగా ఆకాశాన్ని అంటి ఆందోళన కలిగిస్తున్న టమాట ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. టమాటా ధరలు మండిపోతున్న తరుణంలో స్టాలిన్ సర్కార్ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది. చెన్నైలోని రేషన్ దుకాణాల్లో కిలో 60 రూపాయలకే టమాటాలను విక్రయిస్తోంది. చెన్నైలో టమాటా ధర 100 నుంచి 130 రూపాయలు పలుకుతుండగా 82 రేషన్ దుకాణాల్లో అరవై రూపాయలకే విక్రయిస్తున్నారు. త్వరలో ఇతర జిల్లాల్లోని రేషన్ దుకాణాల్లోటమాటాలను రాయితీ ధరకు విక్రయిస్తామని... తమిళనాడు సహకార మంత్రి KR పెరియకురుప్పన్ వెల్లడించారు. రైతుల నుంచి నేరుగా టమాటాలను కొని సగం ధరకే విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ చర్యలపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో టమాటా సాగు ఎక్కువగా ఉండే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లింది.దీంతో సరాఫరా తగ్గిపోయింది. మార్కెట్‌కు వస్తున్న టమాట దిగుబడి తగ్గడం, వానలు, తెగుళ్ల కారణంగా పలుచోట్ల టమాట తోటలను నాశనం చేయడం కూడా కారణంగా మారింది. ముఖ్యంగా టమాటా సాగు అధికంగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్, కోలార్, రామనగర జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. ఈ కారణాలతో టమాట ధరలు భారీగా పెరిగాయి.
టమాట ధరల పెరుగుదలపై స్పందించిన కేంద్రం ప్రభుత్వం రానున్న 10, 15 రోజుల్లో ధరలు దిగివస్తాయని తెలిపింది. ఉత్పత్తి కేంద్రాల నుంచి మార్కెట్లకు టమాటాలు చేరడానికి సమయం పడుతుందని.. ఆ తర్వాత టమాట ధరలు సాధారణ స్థాయికి వస్తాయని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com