ఢిల్లీ పేలుడు వెనక ఉగ్ర కుట్ర..?

ఢిల్లీ పేలుడు వెనక ఉగ్ర కుట్ర..?
X

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భయానక పేలుడుతో దేశం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్‌ వద్ద పార్కింగ్‌లో ఉంచిన ఒక కారు అకస్మాత్తుగా పేలిపోయింది. గేట్‌ నంబర్‌ 1 దగ్గర చోటుచేసుకున్న ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఎగిసిపడటంతో అక్కడ భారీ గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా, 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు తీవ్రత దృష్ట్యా వెంటనే ఫైరింజన్లను పిలిపించారు. సుమారు ఏడు ఫైరింజన్ల సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.

అదే సమయంలో బాంబు స్క్వాడ్‌ బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌ టీమ్స్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించాయి. పేలుడు కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, ఇది సాధారణ ప్రమాదం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించారు. పేలుడు జరిగిన ప్రాంతం చుట్టూ సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణలో ఇది ఉగ్రవాద చర్య కావచ్చని అనుమానిస్తున్నారు. పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉందా? ఎవరైనా ముందుగా ప్లాన్‌ చేసి ఈ దాడి జరిపారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

నిన్ననే గుజరాత్ లో పెద్ద ఎత్తున ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీకి దగ్గర్లోనే రోజు ఉదయం కూడా హర్యానాలో భారీగా పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ అరెస్ట్ లకు ప్రతీకార చర్యగా ఈ పేలుడుకు ఉగ్రవాదులు ఏమైనా ప్లాన్ చేశారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఉగ్రకుట్ర జరగలేదని తోసిపుచ్చలేమన్నారు ఢిల్లీ పోలీసులు. ఈ ఘటనపై స్పెషల్ సెల్ ను ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో ఇంత పెద్ద ఘటన జరగడంతో భద్రతా విభాగాలు హై అలర్ట్‌ ప్రకటించాయి. ప్రధాని మోడీ, అమిత్ షా ఘటనపై ఆరా తీస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.


Tags

Next Story