Mumbai : ముంబయికి ఉగ్ర ముప్పు!
దేశ వాణిజ్య రాజధాని ముంబయికి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబయి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రార్థనా మందిరాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. వివిధ నగరాలకు చెందిన డీసీపీలు(డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్) తమ జోన్లలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం వస్తే ముందుజాగ్రత్త చర్యగా తమకు తెలియజేయాలని పేర్కొన్నారు. వివిధ ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ముంబయిలోని రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్న క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ముంబయిలో ప్రతిఏటా దుర్గాపూజ, దీపావళి పండగలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ఉగ్రముప్పు హెచ్చరికలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అంతే కాకుండా 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఉగ్ర ముప్పు హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com