Tesla: దేశంలో టెస్లా తొలి షోరూం ఓపెన్..

ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ‘‘టెస్లా’’ ఈ రోజు దేశంలోకిఅడుగుపెట్టింది. . ముంబైలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా కొత్త షోరూంను గ్రాండ్‌గా లాంఛ్ చేసింది.. ఈ షోరూంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న మోడల్ Y క్రాస్‌ఓవర్‌లను ప్రదర్శించనున్నారు. జూలై చివరి నాటికి న్యూఢిల్లీలో రెండో షోరూం తెరవాలని టెస్లా భావిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌లో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో లేదు. లాభాల కన్నా, బ్రాండ్ వాల్యూను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇతర దేశాల నుంచి టెస్లా కార్లను ఇండియాలోకి తీసుకువస్తోంది.
టెస్లా దాని ప్రధాన మార్కెట్లు అయిన అమెరికా, చైనాలో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్‌లో తన సత్తా చాటాలని అనుకుంటోంది. కంపెనీ అమ్మకాలు గత త్రైమాసికంలో పడిపోయాయి. అమెరికన్ కంపెనీకి, చైనీస్ కంపెనీ అయిన BYD నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది.
మోడల్ Y ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు. అయితే, మన దేశంలో కొంత మంది మాత్రమే దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీని ధర రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఉంటుందని అంచనా. ముఖ్యంగా, లగ్జరీ వాహన కొనుగోలుదారులకు టెస్లా ఒక మంచి ఎంపిక అవుతుంది. టెస్లా బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీదారులతో పోటీపడబోతోంది. మన దేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను అందించే టాటా, మహీంద్రాలతో పోటీ ఉండే అవకాశం లేదు.
నెలకు రూ.35 లక్షల రెంట్..
ఈ షోరూం కోసం ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ అద్దెకు తీసుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్‌కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె (Monthly Rent) చెల్లించనున్నారని తెలిసింది. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా కూడా టెస్లా జమ చేసినట్లు సమాచారం.
ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది. అయితే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవలే అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)తో భేటీ అయ్యారు. ఆ భేటీలో వాణిజ్య అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా టెస్లా భారత్‌లో ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఇరువురూ ప్రస్తావించినట్లు సమాచారం.
మెదీ అమెరికా పర్యటన సమయంలోనే భారత్‌లో టెస్లా విస్తరణకు బీజం పడింది. ఆటోమొబైల్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు ఈసారి భారత్‌ను ఎంచుకుంది. యూరప్, చైనాలో అమ్మకాలు పడిపోవడంతో ఇండియాలో సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఉంది ఎలాన్ మస్క్ సంస్థ. అందులో భాగంగానే ముంబైలో తమ తొలి షోరూంను ప్రారంభించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన వై మోడల్ కారు ధర పన్నులు, బీమా కలిపితే రూ. 48 లక్షలపైనే ఉండనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com