Parliament : పార్లమెంట్ ను కుదిపేసిన ముస్లిం కోటా లొల్లి

ముస్లిం రిజర్వేషన్ల అంశం ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్య లను నిరసిస్తూ బీజేపీ సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ డిప్యూటీ సీఎం శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యులు బీజేపీ ఎంపీల వైఖరిని తప్పు బట్టారు. సభలో చర్చకు రావాల్సిన అంశాలను రాకుండా అడ్డుకునేందుకే ఆ పార్టీ పథకం ప్రకారం ఈ విధంగా గందరగోళం చేస్తుందని ఆరోపించారు. డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అంశం సభలో చర్చకు రాకుండా ఉండేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడి ఉభయసభలు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే ముస్లింలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యంగ సవరణ చేస్తామం టూ కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ చేసిన వ్యాఖ్యలను నిరశిస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటో స్పష్టం చేయాలని రాజ్యసభలో ప్రతి పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేను డిమాండ్ చేశారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ... ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న నాయకుడు ఆ విధంగా మాట్లా డాల్సింది కాదన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని తాము తేలిగ్గా తీసుకునేది లేదన్నారు. సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య లోక్ సభ మధ్యాహ్నం 12గంటల వరకు, రాజ్యసభ 2గంటల వరకు వాయిదా పడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com