Arvind Kejriwal: సీఎం పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తా.. కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఆప్ కార్యాలయం లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు.ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతానని తెలిపారు. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని, త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. దాంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈరోజు నుంచి రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నాను. సీఎం కుర్చీలో కూర్చోను. కేజ్రీవాల్ నిజాయితీపరుడని ప్రజలు తీర్పు ఇచ్చే వరకు నేను కుర్చీలో కూర్చోను. సతేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ కూడా త్వరలో బయటకు వస్తారు. ఢిల్లీ ప్రజలు మా కోసం ప్రార్థించారు. వారికి నా ధన్యవాదాలు… జైల్లో ఎన్నో పుస్తకాలు చదివాను – రామాయణం, గీత… భగత్ సింగ్ జైలు డైరీని నా వెంట తెచ్చుకున్నాను. భగత్ సింగ్ డైరీని కూడా చదివాను.” అని వ్యాఖ్యానించారు.
కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్టైన ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. నిన్న ( శనివారం ) భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో కలిసి న్యూఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com