Tamil Nadu: చెన్నై పబ్లో విషాదం..

తమిళనాడులోని చెన్నైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బార్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు కార్మికులు మృతిచెందారు. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన ముగ్గురు కార్మికుల్లో.. ఇద్దరు మణిపూర్‌కు చెందినవారు కాగా.. మరొకరు చెన్నైకి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆళ్వార్‌పేటలోని షేక్‌మెట్ క్లబ్‌లో మరమ్మతు పనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పబ్ సీలింగ్ కుప్పకూలింది. గురువారం సాయంత్రం 7.45 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. దీంతో బార్‌లో పనిచేసే ముగ్గురు వలస కార్మికులు దుర్మరణం చెందారు. మృతులను మణిపూర్‌కు చెందిన లాలీ (22), మ్యాక్స్(21), తమిళనాడులోని దుండిగల్‌కు చెందిన రాజ్(45)గా గుర్తించారు. శిథిలాల కింద మరో ముగ్గురు ఉండొచ్చని గ్రేటర్ చెన్నై అడిషనల్ కమిషనర్ ప్రేమ్ ఆనంద్ సిన్హా వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. కాగా, ఈ పబ్‌కు 50 అడుగుల దూరంలోనే బోట్ క్లబ్ మెట్రో స్టేషన్ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ పనుల కారణంగానే పబ్ సీలింగ్ కూలి ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వీటిని మెట్రో రైలు అధికారులు ఖండించారు. టన్నెల్ వర్క్ ప్రస్తుతానికి 500 మీటర్లు మాత్రమే పూర్తయ్యిందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com