Tragedy: వాటర్ ట్యాంక్ కూలి.. ముగ్గురు విద్యార్థులు మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోడల్ విలేజ్‌లోని సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకు కూలింది. పాఠశాల సమయంలో వాటర్ ట్యాంక్ కూలడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్‌లో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ట్యాంక్ కూలడంతో సమీపంలోని గోడ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగింది. ఈ క్రమంలో.. పాఠశాల గందరగోళంలో మునిగిపోయింది. క్షతగాత్రులను టోమో రిబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ కి తరలించారు. 9వ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రాణాలు మిగలలేదు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు.
ఈ ఘటనను డీఎస్పీ, సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ధృవీకరించారు. పాఠశాల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో.. స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యం, నలుగురు వార్డెన్‌లతో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు. పాఠశాల ప్రాంగణం సీలు చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు మోహరించారు. కాగా.. ట్యాంకు కూలిపోవడానికి గల కారణాన్ని గుర్తించేందుకు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని.. ఈ ఘటనలో ఎవరిని వదిలేది లేదని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ ప్రమాదంపై నహర్లగన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌డిపిఓ తెలిపారు. ఉదయం 9:00 గంటల ప్రాంతంలో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమై ట్యాంక్ దగ్గర రివైజ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com