Toll Pass Hike : వాహనదారులకు ఎన్హెచ్ఏఐ షాక్.. పెరిగిన టోల్ పాస్ చార్జీలు, కొత్త రేట్లు ఇవే.

Toll Pass Hike : జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే వాహనదారులకు కేంద్రం షాకిచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కానుండటంతో, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్షిక టోల్ పాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రూ.3000 వార్షిక పాస్ ధరను రూ.3075కి పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హైవేలపై తరచూ రాకపోకలు సాగించే ప్రైవేట్ వాహనదారుల జేబులకు ఇది కొంత అదనపు భారం కానుంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, రూ.3075 చెల్లించి తీసుకునే ఈ వార్షిక పాస్ ఏడాది పొడవునా చెల్లుబాటు అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది. ఈ పాస్ కేవలం 200 సార్లు టోల్ దాటడానికి మాత్రమే అనుమతిస్తుంది. అంటే, ఒకవేళ మీరు ఏడాది పూర్తి కాకముందే 200 సార్లు టోల్ ప్లాజాను దాటేస్తే, ఆ పాస్ గడువు ముగిసినట్లే పరిగణిస్తారు. మళ్ళీ కొత్తగా పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాది గడువు లేదా 200 సార్లు టోల్ దాటడం.. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తయితే అది వర్తిస్తుంది. కేవలం యాక్టివ్‌గా ఉన్న ఫాస్టాగ్ కలిగిన నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
NHAI ఇప్పటికే అన్ని టోల్ ప్లాజాలకు, సంబంధిత అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలను అమల్లోకి తీసుకురావాలని, ప్రయాణికులకు ఈ సమాచారాన్ని ముందుగానే తెలియజేయాలని సూచించింది. ప్రతి ఏటా టోల్ చార్జీలను సమీక్షించే ప్రక్రియలో భాగంగానే ఈ స్వల్ప పెంపును చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రోజువారీ ఆఫీసులకు లేదా వ్యాపారాల నిమిత్తం జాతీయ రహదారులపై తిరిగే వారికి, చిల్లర సమస్య లేకుండా వేగంగా టోల్ దాటడానికి ఈ వార్షిక పాస్ ఇప్పటికీ ఉత్తమమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.
మీరు కూడా ఈ వార్షిక టోల్ పాస్ పొందాలనుకుంటే ప్రక్రియ చాలా సులభం. మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. NHAI అధికారిక వెబ్‌సైట్ లేదా మీరు ఫాస్టాగ్ తీసుకున్న బ్యాంక్/యాప్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి వార్షిక పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లిస్తే, ఆ పాస్ నేరుగా మీ ఫాస్టాగ్ ఖాతాకు లింక్ అవుతుంది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్‌గా గేట్లు తెరుచుకుంటాయి, అదనపు నగదు చెల్లించాల్సిన పని ఉండదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
