Chennai: స్నేహితుడే కాలయముడు.. కొత్త విషయాలు బయటపెట్టిన పోలీసులు

Chennai: స్నేహితుడే  కాలయముడు.. కొత్త విషయాలు బయటపెట్టిన పోలీసులు
గొలుసులతో బంధించి, బ్లేడుతో కోసి..

తమిళనాడులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నందిని హత్య కేసులో ఆమె మిత్రుడు వెట్రిమారన్‌నే పోలీసులు నిందితుడిగా తేల్చారు. నిందితుడు.....నందినిపై అతిగా ఇష్టం పెంచుకున్నాడనీ...అతడి ప్రేమను అంగీకరించకపోవడంతో పక్కా ప్రణాళికతో పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడి గురించి ఆశ్చర్యకర విషయాలు బయటకు వచ్చాయని పోలీసులు తెలిపారు.

చెన్నై సిరుసేరి సమీపంలోని పొన్మార్‌ ప్రాంతంలో ఓ యువతిని చైన్‌లతో కట్టేసి కాల్చిన ఘటనలో ఆమె స్నేహితుడు వెట్రిమారన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా జ్యూడీషియల్ కస్టడీ విధించింది. శనివారం పొన్మార్‌లోని ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతంలో ఓ యువతి కేకలు విన్న స్థానికులు దగ్గరకు వెళ్లి చూడగా ఎవరో చైన్లతో కాళ్లు, చేతులు కట్టేసి తగలబెట్టినట్టు ఉంది. యువతి చేతులపై కత్తులతో కోసినట్టు గాయాలు కూడా ఉన్నాయి. వెంటనే ఆమె చైన్‌లు తొలగించి ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయింది.

యువతి ఫోన్‌లోని వివరాల ఆధారంగా ఆమెను మధురైకి చెందిన 27 ఏళ్ల నందినిగా పోలీసులు గుర్తించారు. ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చిన వారిలో నిందితుడు వెట్రిమారన్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి వ్యవహార శైలిపై అనుమానం వచ్చి విచారించడంతో అసలు నిజాన్ని బయటపెట్టాడని చెప్పారు. వెట్రిమారన్‌గా చెప్పుకుని తిరుగుతున్న వ్యక్తి తొలుత అమ్మాయి అనీపేరు మహేశ్వరి అని విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. నందిని, ఆమె ఒకే పాఠశాలలో చదువుకున్నారని చెప్పారు. యుక్త వయస్సు వచ్చే సరికి మహేశ్వరికి తాను అమ్మాయి కాదని అబ్బాయి లక్షణాలు ఉన్నాయని అర్థం కావడంతో ఇంట్లో తెలిపిందని వివరించారు. విషయాన్ని తల్లిదండ్రులు అంగీకరించకుండా బయటకు గెంటేశారని నిందితుడు చెప్పాడని పేర్కొన్నారు. మహేశ్వరి నుంచి వెట్రిమారన్‌గా పేరు మార్చుకున్నట్టు తెలిపాడన్నారు. మిత్రురాలి పరిస్థితిని అర్థం చేసుకున్న నందిని ఎప్పటిలానే వెట్రిమారన్‌తో స్నేహం కొనసాగించింది.


నందిని తల్లిదండ్రులు కూడా వెట్రిమారన్‌ను బాగానే చూసుకునేవారని తెలుస్తోంది. కొంతకాలానికే నందినిపై అతి ఇష్టం పెంచుకున్న వెట్రిమారన్ఆ మె ఎవరితో మాట్లాడినా సహించేవాడు కాదనీ మరో వ్యక్తితో మాట్లాడితో ఆమెతో వాగ్వాదానికి దిగేవాడని పోలీసులు తెలిపారు. ఇది నచ్చని నందిని క్రమంగా వెట్రిమారన్‌ను దూరం పెట్టిందని సమాచారం. నందిని తనతో వ్యవహరిస్తున్న తీరుపై కోపం పెంచుకున్న వెట్రిమారన్ ఆమెను చంపాలని ప్రణాళిక రచించాడని తెలుస్తోంది. అందులో భాగంగానే డిసెంబర్ 23న నందిని పుట్టినరోజు సందర్భంగా ఆమెతో పాటు పలు దేవాలయాలకు, అనాథ ఆశ్రమాలకు ఇద్దరూ కలిసి వెళ్లారు. రాత్రి వేళ బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తానని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కళ్లకు గంతలు కట్టాడు. ఏదో బహుమతి ఇస్తాడని నందిని భావించగా కొద్ది సేపటిలోనే చైన్లతో బందించి చేతులను కత్తితో గాయపరిచాడు. బ్యాగ్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. నందిని అరుపులు విని స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారిలో కలిసిపోయి ఆమెను రక్షిస్తున్నట్టు నిందితుడు నటించాడు. అతడి వ్యవహార శైలిపై అనుమానం వచ్చి పోలీసులు విచారించడంతో అసలు విషయం బయట పడింది.

Tags

Read MoreRead Less
Next Story