UP : యూపీ ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి

UP : యూపీ ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి
X

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఉన్న ఔసనేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఈరోజు (జులై 28, 2025) తెల్లవారుజామున చోటు చేసుకుంది. శ్రావణ మాసం, సోమవారం కావడంతో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచే భారీ సంఖ్యలో భక్తులు జలాభిషేకం కోసం ఆలయానికి పోటెత్తారు. రద్దీగా ఉన్న సమయంలో, కోతులు దూకడంతో ఒక విద్యుత్ తీగ తెగి ఆలయంలోని టిన్ షెడ్‌పై పడింది. దీనితో షెడ్‌కు కరెంట్ సరఫరా అయ్యింది, దాదాపు 19 మందికి విద్యుత్ షాక్ తగిలింది. అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగలడం, షార్ట్ సర్క్యూట్ వదంతి వ్యాపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగి, తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ, కోతులు విద్యుత్ తీగలను తాకడం వల్ల కరెంట్ వైర్లు తెగిపడి ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పాత విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు.

Tags

Next Story