Driving License : డ్రైవింగ్ లైసెన్సులు ఎన్ని రకాలో తెలుసా? విదేశాల్లో కార్ నడపాలంటే ఏ లైసెన్స్ ఉండాలి?

Driving License : భారతదేశంలో రోడ్డుపై వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. లైసెన్స్ లేకుండా స్టీరింగ్ పట్టుకుంటే ట్రాఫిక్ పోలీసులు భారీ చలానాలతో బాదుతారని మనందరికీ తెలుసు. అయితే మన దేశంలో లైసెన్స్ అనగానే అందరికీ ఒకటే రకం గుర్తుకు వస్తుంది. కానీ, వాస్తవానికి మన దగ్గర రకరకాల డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. మనం వాడే వాహనం, చేసే పనిని బట్టి ఈ లైసెన్సులు మారుతుంటాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లి అక్కడ కార్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఏ లైసెన్స్ ఉండాలి? అసలు మన దేశంలో ఎన్ని రకాల లైసెన్సులు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
డ్రైవింగ్ లైసెన్సుల్లో రకాలు ఇవే
మన దేశంలో ప్రధానంగా నాలుగు రకాల డ్రైవింగ్ లైసెన్సులను రవాణా శాఖ జారీ చేస్తుంది. అవి:
1. లెర్నర్ లైసెన్స్ : వాహనం నేర్చుకునే ప్రారంభ దశలో దీనిని ఇస్తారు. ఇది కేవలం 6 నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ సమయంలో వాహనంపై తప్పనిసరిగా 'L' బోర్డు ఉండాలి.
2. పర్మనెంట్ లైసెన్స్ : లెర్నర్ లైసెన్స్ తీసుకున్న 30 రోజుల తర్వాత డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే దీనిని జారీ చేస్తారు. మనం సొంత వాహనాలు నడుపుకోవడానికి ఇదే ప్రామాణికం.
3. కమర్షియల్ లైసెన్స్ : టాక్సీలు, బస్సులు, ట్రక్కులు వంటి భారీ వాహనాలను నడిపి జీవనోపాధి పొందే వారికి ఇది అవసరం. దీని కోసం ప్రత్యేక శిక్షణ మరియు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
4. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ : ఇది విదేశాల్లో వాహనాలు నడపాలనుకునే వారి కోసం ఇచ్చే ప్రత్యేక అనుమతి పత్రం.
విదేశాల్లో డ్రైవింగ్ చేయాలంటే ఏ లైసెన్స్ కావాలి?
మీరు విదేశాలకు టూర్ వెళ్లినప్పుడు అక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తీసుకుని చక్కర్లు కొట్టాలనుకుంటే.. కేవలం మన ఇండియన్ లైసెన్స్ సరిపోదు. దీని కోసం మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకోవాలి. ఇది మీ ఒరిజినల్ భారతీయ లైసెన్స్‌కు ఒక అధికారిక అనువాదం లాంటిది. ఇది ప్రపంచంలోని అనేక దేశాల భాషల్లో మీ డ్రైవింగ్ అర్హతను తెలియజేస్తుంది. దీనిని మీ పరిధిలోని ఆర్‌టీఓ ఆఫీసు నుంచి పొందవచ్చు. సాధారణంగా దీని కాలపరిమితి ఒక ఏడాది వరకు ఉంటుంది. కొన్ని దేశాల్లో భారత్ లైసెన్స్‌ను కొద్ది రోజులు అనుమతించినా, చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే IDP ఉండటమే సురక్షితం.
లైసెన్స్ పొందేటప్పుడు జాగ్రత్తలు
మనం ఏ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. అది ఆ వాహన కేటగిరీకి సరిపోతుందో లేదో చూసుకోవాలి. టూ వీలర్ కి ఇచ్చే లైసెన్స్ తో ఫోర్ వీలర్ నడపడం నేరం. అలాగే, లైసెన్స్ గడువు ముగియక ముందే దానిని రీన్యూవల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు అంతా ఆన్‌లైన్ కావడంతో లైసెన్స్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సులభమైంది. మీరు ఏ వాహనం నడిపినా, ఏ లైసెన్స్ ఉన్నా.. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం మాత్రం మర్చిపోవద్దు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
