Maharashtra: ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. గవర్నర్‌కు లేఖ రాయాలని ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం..

Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఏక్‌నాథ్ షిండే వర్గంలోని ఏడుగురు మంత్రులపై వేటుకు శివసేన రంగం సిద్ధం చేసింది. మంత్రుల తొలగింపుపై సోమవారం గవర్నర్‌కు సీఎం ఉద్దవ్ ఠాక్రే లేఖ రాయాలని నిర్ణయించారు. అటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నోటీసుకు సోమవారం సాయంత్రం 5 గంటలలోపు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే షిండే సహా 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సమన్లు పంపించారు. పార్టీ లెజిస్లేటివ్ మీటింగ్‌కు రానందుకు.. ఎందుకు డిస్ క్వాలిఫై చేయకూడదో వివరణ ఇవ్వాలని తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతో మహారాష్ట్ర రాజకీయాల్లో తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు డిప్యూటీ స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు షిండే వర్గం ఎమ్మెల్యేలు. శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా అజయ్ చౌదరి నియామకం, డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడాన్ని రెబల్ ఎమ్మెల్యేలు సవాలు చేశారు. డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం తేలే వరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా ఆదేశించాలని షిండే వర్గం సుప్రీంకోర్టును కోరింది.
తమ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దివాలా వెకేషన్ బెంచ్ విచారించనుంది. అటు రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్రం భద్రతను పెంచుతూ వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది. మరోవైపు శివసేనకు షాక్ ఇస్తూ మరో మంత్రి ఉదయ్ సావంత్ షిండే శిబిరంలోకి చేరారు. దాంతో షిండే వర్గంలో మొత్తం మంత్రుల సంఖ్య 8కి చేరింది.
రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే టార్గెట్‌గా శివసేన ఆందోళనలు, విమర్శల దాడిని పెంచుతోంది. ఇంకెంత కాలం గౌహతిలో దాక్కుంటారు… ఎప్పటికైనా ముంబయి రావాల్సిందే కదా అంటూ షిండే వర్గంపై శివసేన నేత సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. రాడిసన్ బ్లూ హోటల్ బిగ్ బాస్ హౌజ్‌లా మారిందని… అక్కడ అన్ని రకాల నాటకాలు నడుస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు. బాల్‌థాక్రే పేరును వాడుకునే అర్హత శివసేనకు తప్ప ఇంకెవరికీ లేదని తేల్చిచెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com