New Delhi : ఢిల్లీ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించిన రిషి సునాక్..
ఇంగ్లాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించన తర్వాత రిషి సునాక్ మొదటి సారిగా భారత్ లో పర్యటిస్తున్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనడానికి రిషి సునాక్ భారత్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ సతీ సమేతంగా న్యూఢిల్లీలోని అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. భార్య అక్షతా మూర్తితో కలిసి రిషి సునాక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తానూ హిందువునని ఎప్పుడూ గర్విస్తు ఉంటానన్న రిషి ఢిల్లీలో ఉండే ఈ రెండు రోజుల్లో ఒక మందిరాన్ని దర్శించాలని అనుకున్నానని అన్నారు. రిషి సునాక్ రాకతో దేవాలయంతో సహా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
జీ20 సమావేశాలకు హాజరుకావడానికి శుక్రవారం ఢిల్లీకి వచ్చారు రిషి సునాక్ దంపతులు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే 'జై శ్రీరాం' అని పలకరిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వారికి స్వాగతం పలికారు. రుద్రాక్ష, భగవద్గీత, హనుమాన్ చాలీసాను రిషి సునాక్ దంపతులకు అందించారు.శనివారం జీ20 సదస్సు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు రిషి సునాక్. వాణిజ్య, పెట్టుబడుల అంశంలో మరిన్ని ఒప్పందాలు చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు.
జీ20 సమ్మిట్‌లో భాగంగా.. రిషి సునాక్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. తొలుత.. భారత్ జీ20 ప్రెసిడెన్సీ సమయంలో యూకే మద్దతు తెలిపినందుకు గాను రిషి సునాక్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 2030 రోడ్‌మ్యాప్.. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, రక్షణ & భద్రత, సాంకేతికత, గ్రీన్ టెక్నాలజీ, వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాల్లో పురోగతి గురించి ఇద్దరు నాయకులు చర్చించుకున్నారు. అలాగే.. భారత్ & యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సహకారం కలిగి ఉండటం పట్ల ఇద్దరు నాయకులు సంతృప్తిగా ఉన్నట్టు తేలింది. ఇదే సమయంలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాల ప్రాముఖ్యతతో పాటు పరస్పర ప్రయోజనాలపై కూడా మోదీ, రిషి తమతమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అనంతరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి.. సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సంతకం చేయాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com