Zelenskyy: భారత్ లో పర్యటించనున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ త్వరలో భారత పర్యటనకు రానున్నారని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జెలెన్‌స్కీ సమావేశమవుతారని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. భారత్, ఉక్రెయిన్ సంయుక్త కమిషన్ సమావేశాన్ని నిర్వహించేందుకు రెండు దేశాలు సన్నద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు.
గుజరాత్‌లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పోలిష్‌చుక్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత దేశాన్ని సందర్శించేందుకు అంగీకరించారని చెప్పారు. ఈ సంయుక్త కమిషన్ సమావేశం ప్రభుత్వ స్థాయి వేదికగా ఉండి, సహకారానికి సంబంధించిన నిర్దిష్ట రంగాలపై చర్చలకు అవకాశం కల్పిస్తుందని వివరించారు. ముఖ్యంగా ఔషధాలు, పరిశ్రమలు, ఓడరేవుల అభివృద్ధి, పర్యాటకం వంటి రంగాల్లో ఉన్న వ్యాపార అవకాశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. గుజరాత్‌లో అందుబాటులో ఉన్న సామర్థ్యాలపై ఉక్రెయిన్ ప్రత్యేక ఆసక్తి చూపుతోందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇదివరకే ప్రకటించారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా కూడా యుద్ధాన్ని విరమించాలని ప్రధాని మోదీ ఆయనను కోరిన విషయం విదితమే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

