Wayanad : వయనాడ్‌లో వర్ణించలేనంత ప్రకృతి బీభత్సం

ప్రకృతి కేరళపై పగబట్టింది. వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపంతో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి మొత్తం 107 మంది మృతి చెందారు. మరో 128 మంది గాయపడ్డాయి. శిథిలాల కింద చాలా మంది ఉంటారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరో పక్క ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి.
వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్ ల ప్రాంతాల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. అనేక వాహనాలు. కొట్టుకుపోయాయి. చురల్మలలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పటికీ
అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరో పక్క ఎడతెరిపి లేని వర్షాలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. తొలుత అర్ధరాత్రి ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయ బృందాలు చేరుకొని బాధితులను సమీపంలోని చురల్మల స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించాయి.
తెల్లవారుజామున దీనికి సమీపంలో మరోసారి కొండచరియలు పడ్డాయి. దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కొట్టుకుపోయాయి. సహాయక బృందాలు గాలింపు చేపడుతున్నాయి. డ్రోన్లు, జాగిలాలతో అన్వేషణ సాగిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రాంతంలోని నాలుగు వీధుల్లో 65 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ మొత్తం ఇళ్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. చాలా మృతదేహాలు మల్లప్పురం చలియార్ నదిలో తేలియాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com