Union Budget 2026 : సెలవు రోజున సెన్సెక్స్ ఊగిపోవాల్సిందే..ఆదివారం నాడే బడ్జెట్ హంగామా.

Union Budget 2026 : ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఫిబ్రవరి 1వ తేదీ దగ్గర పడుతుండటంతో కేంద్ర బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో బడ్జెట్ ఆరోజే ఉంటుందా లేక మారుతుందా? అనే చర్చ మొదలైంది. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. 2026లో ఫిబ్రవరి 1 ఆదివారం వచ్చినప్పటికీ, అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఎక్కువగా ఉందని అధికారిక వర్గాలు సూచిస్తున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) ప్రారంభానికి ముందే అన్ని పార్లమెంటరీ ప్రక్రియలు పూర్తి కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో 1999లో యశ్వంత్ సిన్హా ఆదివారం నాడే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే 2015, 2020లలో శనివారం సెలవు దినం అయినప్పటికీ బడ్జెట్ సెషన్ నిర్వహించారు.
ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌తో ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. ఇది ఆమెకు వరుసగా 9వ బడ్జెట్. భారత చరిత్రలో వరుసగా ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా, పి.చిదంబరం 9 సార్లు ప్రవేశపెట్టారు. అయితే, వారు ఎవరూ కూడా వరుసగా 8 సార్లకు మించి ప్రవేశపెట్టలేదు. ఈ బడ్జెట్‌తో నిర్మలమ్మ చిదంబరం రికార్డును సమం చేయనున్నారు.
పూర్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిదినాన ప్రవేశపెట్టేవారు. కానీ అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, పాలనను క్రమబద్ధీకరించడానికి ఈ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీనివల్ల ఏప్రిల్ 1 నాటికి నిధుల కేటాయింపులు సిద్ధంగా ఉంటాయి. 2026 ఫిబ్రవరి 1న గురు రవిదాస్ జయంతి కూడా ఉండటంతో తేదీ మార్పుపై చర్చ జరిగినప్పటికీ, సంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి 1నే బడ్జెట్ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, తుది నిర్ణయం కేంద్ర కేబినెట్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ తీసుకోవాల్సి ఉంది.
స్వతంత్ర భారత దేశపు 80వ వార్షిక బడ్జెట్ కావడంతో ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు, సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయాలు ఉంటాయని అందరూ ఆశిస్తున్నారు. అలాగే అమెరికా సుంకాల ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేలా, స్వదేశీ తయారీ రంగానికి ఊతమిచ్చేలా ఈ బడ్జెట్ ఉండబోతోందని సమాచారం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

