BJP MLA Devender Rana: బిజేపీ ఎమ్మెల్యే దేవేందర్ రాణా మృతి..

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా (59) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. జితేంద్ర సింగ్ చిన్న సోదరుడైన దేవేంద్ర.. ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో నగ్రోటా స్థానం నుంచి విజయం సాధించారు. జమ్మూ ప్రాంతంలోని ఆ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి జోగిందర్ సింగ్‌పై 30,472 ఓట్లతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఎన్సీ అభ్యర్ధిగా ఇదే స్థానం నుంచి దేవేందర్ గెలవడం విశేషం. డోగ్రా సామాజికి వర్గానికి చెందిన ఆయనకు బలమైన నేతగా గుర్తింపు ఉంది.
ఎమ్మెల్యే దేవేందర్ రాణా మరణించారని తెలియగానే చాలామంది రాజకీయ నాయకులు జమ్మూ గాంధీనగర్ ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి జీతేందర్ సింగ్ రాణా కూడా తన సోదరుడు మరణి వార్త గురించి తెలియగానే ఢిల్లీ నుంచి నాగరోటకు బయలుదేరినట్లు సమాచారం. ప్రస్తుతం దేవేందర్ సింగ్ రాణా ఇంటి వద్ద వందల సంఖ్యలో రాజకీయ నాయకులు సంతాపం తెలిపేందుకు చేరినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా రాణా మృతి వార్త గురించి వినగానే దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. “దేవేందర్ సింగ్ రాణా ఆకస్మిక మరణం గురిచి తెలిసి చాలా బాధ కలిగింది. ఆయన మృతిలో మనం ఒక దేశభక్తుడిని, ఒక జనాభిమానం ఉన్న నాయకుడిని కోల్పోయాం. ఆయన జమ్మూ కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి” అని గవర్నర్ మనోజ్ సిన్హా ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఎమ్మెల్మే దేవేందర్ రాణా మృతి పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఉపముఖ్యమంత్రి సురిందర్ కుమార్ చౌదరి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గులామ్ అహ్మద్ మీర్, పిడిపి అధినాయకురాలు మెహ్‌బూబా ముఫ్తీ సంతాపం తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com