Tirumala Laddu: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రం ఆరా

Tirumala Laddu: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రం ఆరా
X
సమగ్ర దర్యాప్తు చేయాలని నిర్దేశించిన ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా

తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో అత్యంత సున్నితమైన ఈ వ్యవహారంలోకి కేంద్రం కూడా ఎంట్రీ ఇచ్చింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వార్తలపై తీవ్రంగా స్పందించింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. ఈ మేరకు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని కేంద్ర మంత్రి నడ్డా కోరారు.

కేంద్ర ప్రభుత్వం వంద రోజుల పాలనను పురస్కరించుకుని ఢిల్లీలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేపీ నడ్డా.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. చంద్రబాబు వద్ద ఉన్న సమాచారాన్ని పంపించాలని కోరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్న జేపీ నడ్డా..ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై నివేదిక కోరినట్లు వెల్లడించారు.

మరోవైపు తిరుమల ప్రసాదంలో కల్తీ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చంద్రబాబుకు లేఖ రాశారు. ఇది ఎంత మాత్రం క్షమించరాని నేరమని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ప్రజల విశ్వాసం మీద జరిగిన దాడిగా బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. వ్యాపారం కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సైతం దీనిపై విచారణ చేయాలని కోరారు.

Tags

Next Story