CM Stalin : అర్జెంటుగా పిల్లల్ని కనండి.. సీఎం స్టాలిన్ విజ్ఞప్తి

తమిళనాడు ప్రజలు అత్యవసరంగా పిల్లల్ని కనాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ చర్యలు ఇప్పుడు ప్రతికూలంగా మారాయని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు రాష్టం 8 ఎంపీ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు ఆలస్యం చేయకుండా తన విజ్ఞప్తి మేరకు వెంటనే పిల్లల్నికనాలని పిలుపునిచ్చారు. గతంలోనూ స్టాలిన్ ఇలాంటి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 16రకాల సంపదలకు బదులుగా 16 మంది పిల్లలను కనాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. పరిమితంగా పిల్లలను కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టామన్నారు. దీని కారణంగా రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్ సభ స్థానాలు తగ్గేపరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం జనాభా ఆధారంగా పార్లమెంట్ సీట్లను నిర్ణయించొద్దని స్టాలిన్ ఇదివరకే కేంద్రాన్ని కోరారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే, దాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. పార్లమెంటరీ నియోజక వర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తమ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com