Modi-Trump: రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు మినహాయింపు

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా.. ఇంకోవైపు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇంకోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు చమురు సమస్య తలెత్తింది.
ఈ నేపథ్యంలో రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసుకునేందుకు భారతదేశానికి అమెరికా నుంచి 30 రోజులు అనుమతి లభించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. సముద్రంలో చిక్కుకుపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే కొనుగోళ్లు జరగాలని స్పష్టంచేశారు. దీంతో ఆ దేశానికి ఆర్థికపరంగా పెద్దగా ప్రయోజనం చేకూరదని తెలిపారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమ ముడి చమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
2022 నుంచి రష్యా చమురును భారత్ గణనీయంగా దిగుమతి చేసుకుంటోంది. అయితే.. ఆంక్షలు, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఇటీవల ఈ దిగుమతులు తగ్గాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు దిగడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈనేపథ్యంలో చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 83 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
