US: అగ్రరాజ్య ఆయుధం... భారత్‌కు జావెలిన్ బలం

భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 93 మిలియన్ డాలర్ల (సుమారు ₹775 కోట్లు) విలువైన అధునాతన ఆయుధాలను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైనది, ప్రపంచవ్యాప్తంగా తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్న జావెలిన్ క్షిపణి వ్యవస్థ మన దేశానికి అందనుంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యానికి ‘దేవదూత’గా వ్యవహరించిన ఈ ట్యాంక్ విధ్వంసక ఆయుధం (Anti-Tank Guided Missile - ATGM) ఇప్పుడు భారత సైన్యం సత్తాను మరింత పెంచనుంది. భూతల దళాలకు, ముఖ్యంగా సరిహద్దుల్లో, పర్వత ప్రాంతాల్లో ట్యాంకుల విధ్వంసానికి ఇదొక గేమ్ ఛేంజర్ కానుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు
జావెలిన్ ప్రత్యేకతలు
జావెలిన్ (FGM-148) అనేది భుజంపై నుంచి ప్రయోగించే, 'ఫైర్-అండ్-ఫర్గెట్' రకానికి చెందిన క్షిపణి. దీని ప్రత్యేకత ఏమిటంటే, క్షిపణిని ప్రయోగించే వ్యక్తి ప్రమాదంలో పడకుండా చూసే డిజైన్. షోల్డర్-ఫైర్ : దీనిని తీసుకెళ్లడం, ప్రయోగించడం సులభం. దీనిలో క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. సెన్సర్లకు చిక్కకుండా: సాధారణంగా ట్యాంక్ విధ్వంసక క్షిపణిని ప్రయోగించినప్పుడు వెలువడే పొగ, వేడిని శత్రువుల సెన్సర్‌లు సులభంగా గుర్తిస్తాయి. కానీ జావెలిన్‌లో, తొలుత ఓ మోటార్ క్షిపణిని ట్యూబ్ నుంచి కొద్ది దూరం 'విసిరిన' తర్వాతే ప్రధాన క్షిపణి మోటార్ పనిచేయడం మొదలుపెడుతుంది. దీనిని సాఫ్ట్-లాంచ్ అంటారు. ఈ విధానం వల్ల, ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువులకు కచ్చితంగా తెలియదు.
డబుల్ ఎటాక్: ఇది ఆధునిక ట్యాంకులపై ఉండే రియాక్టివ్ ఆర్మర్ రక్షణ కవచాలను సైతం ఛేదించగలదు. దీనిలో రెండు దశల్లో పేలుడు పదార్థాలు ఉంటాయి. తొలి దశలో కవచాన్ని ఛేదించి, మలిదశలో ట్యాంకును ధ్వంసం చేస్తుంది. ఈ 'టాండమ్ వార్‌హెడ్' టెక్నాలజీ దీనిని అత్యంత శక్తిమంతం చేస్తుంది.
టాప్ అటాక్ మోడ్: ఇది ట్యాంకుపై భాగం (Top) అత్యంత పలుచగా, బలహీనంగా ఉండే ప్రాంతంలో గురిపెట్టి దాడి చేస్తుంది.
వ్యూహాత్మక ప్రాధాన్యత
రష్యాతో జరిగిన పోరాటంలో జావెలిన్ ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో ప్రపంచం చూసింది. ఉక్రెయిన్ సైన్యం దీనిని ఉపయోగించి వందలాది రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేసింది. ఈ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి రష్యా తమ ట్యాంకులకు లోహపు బోన్లను అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దీని శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్ పౌరులు కృతజ్ఞతగా తమ పిల్లలకు 'జావెలిన్', 'జావెలినా' అని పేర్లు పెట్టుకోవడం ఈ ఆయుధం ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
భారత్‌కు బలమెంత?
ఈ ఒప్పందం కింద, 45.7 మిలియన్ డాలర్ల విలువైన జావెలిన్ ఎఫ్‌జీఎం-148 మిసైల్స్, 25 జావెలిన్ లైట్‌వెయిట్ కమాండ్ లాంఛ్ యూనిట్స్ (CLUలు) భారత్‌కు అందనున్నాయి. మిగిలిన 47.1 మిలియన్ డాలర్ల విలువతో ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్, ఇతర సైనిక పరికరాలు విక్రయించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

