Javelin Missiles: ట్యాంకుల పాలిట సింహస్వప్నం 'జావెలిన్'

మారుతున్న భద్రతా దృష్ట్యా సైనిక బలగాల ఆధునికీకరణలో భాగంగా భారత్ మరిన్ని కీలక ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, ట్యాంకుల పాలిట సింహస్వప్నంగా పేరుగాంచిన అత్యాధునిక 'జావెలిన్' క్షిపణి వ్యవస్థను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. ఇది భారత సైనికుల పోరాట సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతోపాటు, యుద్ధరంగంలో వారిని మరింత సురక్షితంగా ఉంచడానికి దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న అధునాతన ట్యాంకు విధ్వంసక క్షిపణుల్లో జావెలిన్ ఒకటి. దీనిని అమెరికాకు చెందిన రేథియాన్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఆయుధాన్ని భారీ లాంఛ్ వ్యవస్థలు లేకుండా, సైనికుడి భుజంపైనుంచి సులువుగా ప్రయోగించవచ్చు.
జావెలిన్ ఒక 'ఫైర్ అండ్ ఫర్గెట్' (Fire and Forget) ఆయుధం. అంటే, లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత, క్షిపణిలోని పరారుణ సీకర్ (Infrared Seeker) సహాయంతో అది లక్ష్యాన్ని ఛేదించే పనిని సొంతంగా చూసుకుంటుంది. దీనివల్ల ప్రయోగించిన సైనికుడు వెంటనే వేరేచోటుకు వెళ్లిపోవచ్చు లేదా మరో లక్ష్యాన్ని గురిపెట్టవచ్చు.
టాప్ ఎటాక్ మోడ్: క్షిపణి సుమారు 500 అడుగుల ఎత్తుకు చేరి, ట్యాంకు కవచం అంతగా పటిష్టంగా లేని పైభాగాన్ని ఛేదిస్తుంది.
డైరెక్ట్ ఎటాక్ ఆప్షన్: ఇది నేరుగా వెళ్లి బంకర్లు, భవనాలు, వాహనాలను ధ్వంసం చేస్తుంది.
సాఫ్ట్‌లాంచ్ డిజైన్: ఈ డిజైన్ కారణంగా దీన్ని బంకర్లు, భవనాలు వంటి నిర్మాణాల లోపలి నుంచి కూడా సురక్షితంగా ప్రయోగించవచ్చు. ఇది ప్రయోగించిన సైనికుడికి వేడి వాయువుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
కవచ ఛేదన: ట్యాంకులకు ఉండే సాంప్రదాయ కవచంతో పాటు దుర్భేద్యమైన ఎక్స్‌ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ (ERA)లనూ ఛేదించే సత్తా దీనికి ఉంది. ట్యాంకును ధ్వంసం చేయడానికి ఇది రెండు దశల పేలుళ్లను సృష్టిస్తుంది. జావెలిన్‌ను అఫ్గానిస్థాన్, ఇరాక్లలో విరివిగా ఉపయోగించారు. రష్యాపై పోరులో ఉక్రెయిన్ దీనిని భారీగా ప్రయోగించి రష్యా ట్యాంకులను సమర్థవంతంగా విధ్వంసం చేయడంతో, ఉక్రెయిన్‌లో దీనిని 'సెయింట్'గా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా 25కి పైగా దేశాలు ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. లక్ష్య ఛేదనలో దీని కచ్చితత్వం 94 శాతంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

