TERRORIST: ఎన్‌ఐఏ అదుపులో తహవూర్ రాణా

TERRORIST:  ఎన్‌ఐఏ అదుపులో తహవూర్ రాణా
X
పటిష్ట భద్రత మధ్య అమెరికా నుంచి భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్ ఉగ్రవాది

భారత్ లో రక్తపాతం పారించి.. మారణ హోమాన్ని సృష్టించి.. 166 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదికి.. భారత ప్రభుత్వం రాచమర్యాదలతో స్వాగతం పలికింది. ప్రత్యేక విమానం.. రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం, రక్షణగా స్వాత్‌ కమాండోస్‌ వెంటరాగ... ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన తహవూర్‌ రాణాను తిహార్ జైల్లో పడేశారు. ఈ ముష్కరుడికి జైల్లో భారీ భద్రత కల్పించి.. బిర్యానీలు తినిపించి.. మేపవద్దంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి రాణాకు ఉరిశిక్ష వేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ప్రత్యేక విమానంలో...

ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన లష్కరే ఉగ్రవాది తహవూర్‌ రాణాను అమెరికా ప్రభుత్వం.. భారత్‌కు అప్పగించింది. భారీ భద్రత మధ్య ప్రత్యేక విమానంలో రాణాను భారత్ కు తీసుకొచ్చారు. ఈ ముష్కరుడి రాకతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాణాను ఎయిర్‌పోర్ట్‌ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయానికి తరలించేందుకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికల్‌ వాడారు. ఎయిర్‌పోర్ట్‌లో స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ కమాండోలను మోహరించారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ కారుతోపాటు కాన్వాయ్‌లో సాయుధ వాహనాలను ఏర్పాటు చేశారు. కాన్వాయ్‌లో ‘మార్క్స్‌మ్యాన్’ వాహనం కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ వాహనం ఏ రకమైన దాడినైనా తట్టుకోగల సురక్షితమైన సాయుధ కారు. ఈ వాహనాన్ని సాధారణంగా తీవ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు వంటి అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులను కోర్టులు, ఏజెన్సీ కార్యాలయాలకు తరలించేందుకు భద్రతా సంస్థలు ఉపయోగిస్తాయి.

అసలేం జరిగింది..

16 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్‌ 26న పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి తెగబడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముష్కర ముఠా నగరంలో రక్తపుటేరులు పారించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌ హోటల్‌, లియోపోల్డ్‌ కేఫ్‌, ముంబై చాబాద్‌-హౌస్‌, నారిమన్‌ హౌస్‌, కామా హాస్పిటల్‌ ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి లాస్‌ ఏంజెల్స్‌ జైల్లో శిక్ష అనుభవించాడు.

Tags

Next Story