US: ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు ఎదురుదెబ్బ

ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా(64)కు మరోసారి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు కొట్టేసింది. తాజాగా మరోసారి తహవూర్ రాణా పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు లైన్‌క్లియర్ అయింది.
తన హెబియస్ కార్పస్ పిటిషన్ ఫలితం వచ్చే వరకు భారత్‌కు అప్పగింతపై స్టే విధించాలని తహవూర్ రాణా అత్యవసర దరఖాస్తును దాఖలు చేశాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని.. ఈ సమయంలో భారతదేశానికి అప్పగిస్తే హింస, మరణానికి గురయ్యే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ జాతీయుడు తహవూర్ రాణా ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో ఉన్నాడు. 2008లో ముంబై ఉగ్ర దాడుల్లో ఆరుగురు అమెరికన్లతో పాటు 166 మంది చనిపోయారు. ఈ దాడుల్లో తహవూర్ రాణా నిందితుడిగా ఉన్నాడు.
ముంబై దాడుల కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు. దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. రాణాకు లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయి. అనంతరం షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. 2011లో అమెరికాలో దోషిగా తేలిన తర్వాత లాస్ ఏంజిల్స్ జైల్లో ఉంటున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com