ISRO New Chief: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త చైర్మెన్‌గా వీ నారాయణన్‌ను నియమించారు. ప్రస్తుతం ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ స్థానంలో ఈనెల 14వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా నారాయణన్‌ను నియమించారు. లిక్విడ్ ప్రొపల్సన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్‌పీఎస్సీ) అధిపతిగా ఉన్న నారాయణన్.. రెండేళ్ల పాటు ఇస్రో చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ మంగళవారం రిలీజ్ చేసిన ఓ నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. స్పేస్ కమీషన్‌కు కూడా ఆయన చైర్మెన్‌గా కొనసాగనున్నారు. క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధిలో నారాయణన్ కీలక పాత్ర పోషించారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీగా సోమనాథ్ .. జనవరి 14, 2022లో బాద్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పాటు ఆ విధులను నిర్వర్తించారు. ఇస్రో కొత్త చీఫ్‌గా నియమితుడైన నారాయణన్.. ఇస్రోలో నిష్ణాత శాస్త్రవేత్తగా పేరున్నది. ఆయన సుమారు నాలుగు దశాబ్ధాల నుంచి ఇస్రోకు సేవలు అందిస్తున్నారు. విశేష అనుభవం ఉన్న ఆయన.. అనేక కీలక పోస్టుల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్సన్ టెక్నాలజీలో నారాయణన్‌కు అద్భుతమైన అనుభవం ఉన్నది.
జీఎస్ఎల్వీ ఎంకే 3 వెహికల్‌కు చెందిన సీ25 క్రయోజనిక్ ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా చేశారు. ఆయన నాయకత్వంలోనే ఇస్రో బృందం విజయవంతంగా సీ25 స్టేజ్‌ను డెవలప్ చేసింది. జీఎస్ఎల్వీ మాక్ 3 రాకెట్ అభివృద్ధిలో సీ25 స్టేజ్ కీలకమైందిగా నిలిచింది. రాకెట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్సన్ నిపుణుడైన నారాయణన్.. 1984లో ఇస్రోలో చేరారు. తన కెరీర్ ఆరంభంలో ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లోని.. సాలిడ్ ప్రొపల్సన్ సౌండింగ్ రాకెట్స్, ఆగుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(ఏఎస్ఎల్వీ), పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్ఎల్వీ)లో పనిచేశారు. క్రయోజనిక్ ఇంజినీరింగ్‌లో ఆయన ఎంటెక్ పూర్తి చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆయన ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత లిక్విడ్ ప్రొపల్సన్ సిస్టమ్స్ సెంటర్‌లోని క్రయోజనిక్ ప్రొపల్సన్ ఏరియాలో చేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com