Vande Bharat Sleeper : రైల్వే కొత్త రూల్స్..నో రిజర్వేషన్..నో రీఫండ్..టికెట్ క్యాన్సిల్ చేస్తే పైసా రాదు.

Vande Bharat Sleeper : రైల్వే కొత్త రూల్స్..నో రిజర్వేషన్..నో రీఫండ్..టికెట్ క్యాన్సిల్ చేస్తే పైసా రాదు.
X

Vande Bharat Sleeper : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సక్సెస్ తర్వాత, భారత రైల్వే ఇప్పుడు ప్రయాణికుల కోసం సరికొత్త వందే భారత్ స్లీపర్ రైలును పట్టాలెక్కించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హౌరా - కామాఖ్య (గువహటి) మధ్య నడిచే ఈ తొలి స్లీపర్ రైలును ప్రారంభించారు. విమాన ప్రయాణానికి దీటైన సౌకర్యాలు, వేగంతో ఈ రైలు రూపొందింది. అయితే ఇందులో ప్రయాణించాలనుకునే వారు తమ ప్లానింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రైలు టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ నియమాలను రైల్వే శాఖ చాలా కఠినతరం చేసింది. చిన్న పొరపాటు చేసినా మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.

రైల్వే బోర్డ్ జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. వందే భారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలు విమాన సంస్థల తరహాలో ఉన్నాయి. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు వరకు టికెట్ క్యాన్సిల్ చేయకపోతే, మీకు ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. అంటే మీ పూర్తి ప్రయాణ ఛార్జీని కోల్పోవాల్సిందే. ఒకవేళ మీకు కన్ఫర్మ్ టికెట్ ఉండి, దానిని రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందే క్యాన్సిల్ చేస్తే, టికెట్ ధరలో 25 శాతం కోత విధిస్తారు. అదే 72 గంటల నుంచి 8 గంటల లోపు క్యాన్సిల్ చేస్తే ఏకంగా 50 శాతం డబ్బులు కట్ అవుతాయి. అంటే కేవలం సగం డబ్బులు మాత్రమే మీకు వాపస్ వస్తాయి.

సాధారణంగా రైళ్లలో టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఆర్ఏసీ ద్వారా సగం సీటు దొరుకుతుంది. కానీ వందే భారత్ స్లీపర్‌లో ఈ విధానాన్ని రైల్వే పూర్తిగా ఎత్తేసింది. టికెట్ కన్ఫర్మ్ అయితేనే బెర్త్ దొరుకుతుంది, లేదంటే లేదు. అలాగే ఈ రైలులో అన్ని రకాల కోటాలు పనిచేయవు. కేవలం మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్‌లు ఉన్నవారికి మాత్రమే కోటా వర్తిస్తుంది. మిగతా వీఐపీ లేదా ఇతర సాధారణ కోటాలకు ఇక్కడ చోటు లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..ఈ రైలులో కనీస ప్రయాణ దూరం 400 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అంటే మీరు 100 కిలోమీటర్లు ప్రయాణించినా, 400 కిలోమీటర్ల ఛార్జీ చెల్లించాల్సిందే.

తగ్గనున్న ప్రయాణ సమయం హౌరా-గువహటి రూట్‌లో ప్రారంభమైన ఈ రైలు పూర్తిగా ఏసీ సౌకర్యం కలిగి ఉంది. రాత్రిపూట ప్రయాణాన్ని విలాసవంతంగా మార్చేలా దీనిని డిజైన్ చేశారు. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ రైలు ప్రయాణ సమయాన్ని దాదాపు రెండున్నర గంటల వరకు తగ్గిస్తుంది. తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణ అనుభూతిని అందించడమే రైల్వే లక్ష్యం. అందుకే సౌకర్యాలు ఎంత విలాసవంతంగా ఉన్నాయో, నిబంధనలు కూడా అంతే కఠినంగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణ ప్లాన్ పక్కాగా ఉంటేనే టికెట్ బుక్ చేసుకోవడం మంచిది.

Tags

Next Story