Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు..

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు..
X
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

మణిపూర్‌లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో బీహార్‌కు చెందిన ఇద్దరు కూలీలున్నారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని కూడా పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు. మృతులు 18 ఏళ్ల సునీలాల్ కుమార్, 17 ఏళ్ల దశరత్ కుమార్‌గా గుర్తించారు. వారు బీహార్‌ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలోని రాజ్‌వాహి గ్రామ నివాసులు. కాగా.. యువకులిద్దరూ కక్చింగ్‌లోని మెయిటీ ఆధిపత్య ప్రాంతంలో నివసిస్తున్నారు. కక్చింగ్-వాబగై రోడ్డులోని పంచాయతీ కార్యాలయం సమీపంలో సాయంత్రం 5:20 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు వారిని కాల్చేశారు.

కార్మికులపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మణిపూర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న కుల ఘర్షణల కారణంగానే వారిని హతమార్చినట్లు తెలుస్తోంది. మణిపూర్ పోలీసు కమాండోలు తౌబల్ జిల్లాలోని సలుంగ్‌ఫామ్ మానింగ్ లేకై వద్ద అనుమానిత ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన ఉగ్రవాదిని 16 ఏళ్ల లైష్రామ్ ప్రియమ్ అలియాస్ లోక్‌తక్‌గా గుర్తించారు. అతను నిషేధిత సంస్థ PREPAK సభ్యుడు. ఆ ప్రాంతంలో సాయుధులు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల సమాచారం అందింది. దీంతో.. ఉదయం 9:30 గంటలకు సలుంగ్‌ఫామ్ హైస్కూల్ సమీపంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్‌కౌంటర్‌లో ప్రియమ్‌ను కాల్చి.. అనంతరం ఇంఫాల్‌లోని రాజ్ మెడిసిటీ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించాడు.

అతని వద్ద నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు INSAS రైఫిల్స్, SLIR రైఫిల్, 303 రైఫిల్, AMOGH రైఫిల్, అనేక మ్యాగజైన్లు.. మందుగుండు సామగ్రి ఉన్నాయి. నాలుగు చక్రాల వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. కుకీ మిలిటెంట్ల దాడుల నుంచి గ్రామాలను రక్షించేందుకు మూడు నెలల క్రితం తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని ప్రియమ్ తల్లి లైష్రామ్ గీత్మాల తెలిపారు. ప్రియం హైస్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడని ఆమె చెప్పింది. “ఈ సంక్షోభం అంతం కావాలి. హింస ఆగకపోతే, ఈ రోజు నేను అనుభవిస్తున్న అదే బాధను చాలా కుటుంబాలు అనుభవిస్తాయి” ప్రియమ్ తల్లి అన్నారు.

Tags

Next Story