Vivad Se Vishwas 2.0 Scheme : అక్టోబర్ 1 నుంచి వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం

ప్రత్యక్ష పన్ను వివాదాల్ని పరిష్కరించడానికి తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం అమలు తేదీని కేంద్రం నోటిఫై చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుందని శుక్రవారం వెల్లడించింది. ప్రత్యక్ష పన్ను అప్పీళ్ల సెటిల్‌మెంట్ కోసం ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన 2024–-25 బడ్జెట్‌లో ఈ పథకం గురించి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివిధ న్యాయ వేదికల్లో రూ.35 లక్షల కోట్ల విలువైన 2.7 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈనేపథ్యంలో బడ్జెట్‌లో ఈ పథకాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పన్ను విధానాలను సరళీకరించడంతో పాటు, పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సేవలను మెరుగుపరిచి, చిక్కుముడులు తగ్గించాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వివాద్ సే విశ్వాస్ 2.0కు సంబంధించిన నిబంధనలు, ఫారాలు వచ్చే వారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ కరిష్మా ఆర్ ఫాటర్మేకర్ పేర్కొన్నారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివాదాలు/అప్పీళ్ల పరిష్కారం కోసం 2020లోనూ ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. వివాద్ సే విశ్వాస్ పేరిట అమల్లోకి వచ్చిన ఈ స్కీమ్‌ను సుమారు లక్ష మంది పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకున్నారు. దీంతో రూ.75వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరాయి. ఈనేపథ్యంలో 2.0కు కేంద్రం శ్రీకారం చుట్టింది. 2024 జులై 22 నాటికి సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునళ్లు, కమిషనర్లు/ జాయింట్ కమిషనర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న పన్ను చెల్లింపులకు సంబంధించి వివాదాలు/ అప్పీళ్లను ఈ స్కీమ్ కింద పరిష్కరించుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com