Waqf Bill : నేడు లోక్‌సభలో వక్ఫ్ బిల్లు

‘ద వక్ఫ్ బిల్లు’ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులు చేసింది. బోర్డు పాలనా వ్యవహారాల్లో మహిళలు, ముస్లిమేతరులకు కూడా చోటు కల్పించాలని భావిస్తోంది. దాదాపు 44 సవరణలతో రూపొందించిన ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ సభ్యులకు అందజేసింది. దీనిపై కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వక్ఫ్ చట్టం అమల్లోకి రావడానికి ముందుగానీ, వచ్చిన తర్వాతగానీ ఏదైనా ప్రభుత్వ భూమిని వక్ఫ్ భూమిగా గుర్తించినా, ప్రకటించినా.. ఈ బిల్లులో చేసిన ప్రతిపాదన ప్రకారం దాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరు. అది ఎవరి భూమో తేల్చే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టారు. వారు విచారణ జరిపి నివేదిక ఇచ్చేదాకా అది వక్ఫ్ ఆస్తి కాదు. ఒకవేళ కలెక్టర్ ఆ భూమి ప్రభుత్వానిదే అని నివేదిక ఇస్తే ప్రభుత్వం ఆ నివేదికను వక్ఫ్‌బోర్డుకు పంపుతుంది. బోర్డు తన రికార్డుల్లో దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొనాల్సి ఉంటుంది. కలెక్టర్ కూడా రెవెన్యూ రికార్డుల్లో దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొనాలి. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారం ఆ భూమి ప్రభుత్వానిదా? వక్ఫ్ బోర్డుదా? అనే విషయాన్ని తేల్చే అధికారం కేవలం వక్ఫ్ ట్రైబ్యునల్‌కు మాత్రమే ఉండేది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఆ అవకాశం ఉండదు.
ఇస్లాం మతాచారాలు పాటించేవారు తమకున్న స్థిర, చరాస్తులను దానం చేస్తే, ఆ ఆస్తులను వక్ఫ్ అంటారు. ఈ ఆస్తులన్నింటినీ నిర్వహించేదే వక్ఫ్ బోర్డు. దేశ విభజన సమయంలో ఇండియా నుంచి పాక్ వెళ్లిపోయిన ముస్లింల ఆస్తులను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. దేశంలోని 30 వక్ఫ్ బోర్డుల పరిధిలో 9.4 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు. మిలిటరీ, రైల్వే తర్వాత అత్యధికంగా భూములు కలిగి ఉన్నది వక్ఫ్ బోర్డులే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com