WAR: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసినట్టే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీల మధ్య జరిగిన కీలకమైన సమావేశం తర్వాత ఉక్రెయిన్ యుద్ధంపై ఆశలు చిగురించాయి. యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ఇద్దరు నాయకులు చెప్పారు. అయినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు చాలా క్లిష్టంగా ఉన్నాయని తెలిపారు. ఫ్లోరిడాలోని ట్రంప్ మార్-ఎ-లాగో రిసార్ట్‌లో చర్చలు జరిగాయి, అక్కడ ఇద్దరు నాయకులు దాదాపు మూడు గంటల పాటు చర్చించారు. తరువాత ఉమ్మడి విలేకరుల సమావేశం నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… రానున్న కొన్ని వారాల్లో శాంతి చర్చలు విజయవంతమవుతాయా లేదా అన్నది స్పష్టమవుతుందని అన్నారు. చర్చలు గణనీయంగా ముందుకు వెళ్లాయని, ఇరు దేశాల మధ్య నమ్మకం పెరిగిందని చెప్పారు. జెలెన్స్కీ కూడా ఈ భేటీని సానుకూల సమావేశంగా అభివర్ణించారు. శాంతి ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పై కీలక అంగీకారం కుదిరిందని తెలిపారు. భద్రతా హామీల అంశంలో పెద్ద ముందడుగు పడిందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. యుక్రెయిన్ భద్రతపై పూర్తి స్థాయి హామీలకు అంగీకారం కుదిరిందని ఆయన వెల్లడించారు. ట్రంప్ కూడా దాదాపు 95 శాతం వరకు ఈ అంశంలో ఒప్పందం సిద్ధమైందని చెప్పారు. యూరోపియన్ దేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, అమెరికా వాటికి మద్దతు ఇస్తుందని తెలిపారు. బలమైన భద్రతా హామీలు లేకుండా శాశ్వత శాంతి సాధ్యం కాదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.
అయితే డొన్బాస్ ప్రాంతం విషయంలో ఇంకా పూర్తి స్థాయి ఒప్పందం కుదరలేదని ఇద్దరు నేతలు అంగీకరించారు. రష్యా డిమాండ్ మేరకు డొన్బాస్ నుంచి యుక్రెయిన్ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడానికి కీవ్ సిద్ధంగా లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ట్రంప్ ఇది అత్యంత క్లిష్టమైన అంశమని, అయినప్పటికీ దీనిపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై తుది నిర్ణయం ప్రజల అభిప్రాయం ఆధారంగానే ఉంటుందని, అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమని జెలెన్స్కీ చెప్పారు.
ఈ భేటీకి ముందు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణను ట్రంప్ ఉపయోగకరమని పేర్కొనగా, క్రెమ్లిన్ దీనిని స్నేహపూర్వక చర్చగా అభివర్ణించింది. యూరోప్, యుక్రెయిన్ ప్రతిపాదించిన 60 రోజుల కాల్పుల విరమణ యుద్ధాన్ని మరింత పొడిగించే ప్రమాదం ఉందని రష్యా అభిప్రాయపడింది. ఆర్థిక, భద్రతా అంశాలపై సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది. ఈ కీలక సమావేశం జరుగుతున్న సమయంలోనే రష్యా కీవ్‌తో పాటు ఇతర యుక్రెయిన్ ప్రాంతాలపై భారీగా మిసైల్, డ్రోన్ దాడులు చేసింది. దీంతో కీవ్‌లో విద్యుత్, హీటింగ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇవి శాంతి ప్రయత్నాలపై ఒత్తిడి తీసుకురావడానికేనని జెలెన్స్కీ ఆరోపించారు. అయితే పుతిన్, జెలెన్స్కీ ఇద్దరూ శాంతి విషయంలో నిజాయితీగా ఉన్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. జాపొరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం అంశం కూడా ఈ చర్చల్లో ప్రాధాన్యత పొందింది. అక్కడ సంయుక్త నియంత్రణకు అమెరికా ప్రతిపాదన చేసింది. విద్యుత్ లైన్ల మరమ్మతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని సమాచారం. అమెరికా–యుక్రెయిన్ మధ్య 20 అంశాల శాంతి ప్రణాళికపై చర్చలు జరగగా, దాదాపు 90 శాతం అంశాలపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. యుద్ధం ముగియడానికి తన పర్యటన ఉపకరిస్తే యుక్రెయిన్‌కు వెళ్లేందుకు సిద్ధమని ట్రంప్ తెలిపారు. అక్కడి పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించడానికీ సిద్ధమని చెప్పారు. అయితే ప్రస్తుతం అది అత్యవసరం కాదని స్పష్టం చేశారు. జెలెన్స్కీ మాత్రం ట్రంప్‌ను యుక్రెయిన్‌కు ఆహ్వానించారు. ఈ శాంతి ప్రక్రియలో యూరోపియన్ దేశాల పాత్ర మరింత పెరుగుతోంది. ఇప్పటికే బ్రిటన్ ప్రధానితో జెలెన్స్కీ ఫోన్‌లో మాట్లాడగా, త్వరలో ఇతర యూరోపియన్ నేతలతో కూడా సంయుక్త చర్చలు జరగనున్నట్లు సమాచారం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

