Vice President : ఆయనపై కేసు నమోదు చేయలేకపోతున్నాం.. ఉపరాష్ట్రపతి

Vice President : ఆయనపై కేసు నమోదు చేయలేకపోతున్నాం.. ఉపరాష్ట్రపతి
X

జడ్జి ఇంట్లో డబ్బులు దొరికిన అంశంపై ఉపరాష్టపతి జగదీప్ ధన్ ఖడ్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరికినా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఆయన వ్యాక్యానించారు. మూడు దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు వల్ల న్యాయవ్యవస్థ అనుమతి లేకుండా న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి వీల్లేకుండా పోయిందన్నారు.

కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్ స్టూడెంట్స్, లెక్చరర్లతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మ కేసును ప్రస్తావిస్తూ, ఓ హైకోర్టు జడ్జి అధికారిక నివాసంలో అంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం ఘోరమైన నేరం అని అన్నారు. “ఆ డబ్బు ఎక్కడిది? ఒక న్యాయమూర్తి ఇంటికి అది ఎలా చేరింది? అనే ప్రశ్నలను సందించారు. ఈ ఘటనలో పలు చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించారని.. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. “కేంద్రం చేతులు కట్టేసినట్లుగా పరిస్థితి ఉంది. 90వ దశకంలో సుప్రీం ఇచ్చిన ఓ తీర్పుతో మేం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్నాం. నేను న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని, న్యాయమూర్తుల రక్షణను గట్టిగా సమర్థిస్తాను. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సుప్రీం మౌనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది” అని ధన్‌ఖడ్ అన్నారు.

Tags

Next Story