weather: సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ద్రోణి

weather:  సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ద్రోణి
నైరుతి రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది

నైరుతి రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు పలు ప్రాంతాలకు విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు మధ్యప్రదేశ్‌లోని ఆగ్నేయ ప్రాంతం నుంచి దక్షిణ, ఉత్తర కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ, విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వెల్లడించారు. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నాయని, వాటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.

ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. శుక్రవారం వాతావరణం పొడిగా ఉంటుందని, దాంతో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని వెల్లడించింది. రాగల మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశమున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ చుట్టూ పక్కల జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story