Supreme Court : టెర్రరిస్టులపై స్పైవేర్ వాడితే తప్పేంటి? : సుప్రీంకోర్టు

Supreme Court : టెర్రరిస్టులపై స్పైవేర్ వాడితే తప్పేంటి? : సుప్రీంకోర్టు
X

పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్ల పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ భద్రత కోసం స్పైవేరు కలిగి ఉండటం తప్పులేదని స్పష్టంచేసింది. ఈసందర్భంగా పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్ స్పై వేర్ను ఉపయోగిస్తోందా? లేదా అన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలన్నారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణులు బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. దీనికి ధర్మాసనం బదులిస్తూ.. 'దేశ వ్యతిరేక శక్తులపై స్పైవేరు వినియోగిస్తే ఏ తప్పు లేదు. నేషనల్ సెక్యూరిటీ విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసే ఏ నివేదికను బహిర్గతం చేయబోం. కానీ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం. ఇదే సమయంలో.. సాంకేతిక కమిటీ నివేదికను వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్ గా మార్చరాదు' అని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ సంద ర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 'ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని తెలిపింది.

Tags

Next Story