ODISHA TRAIN ACCIDENT: రాంగ్ సిగ్నలింగే ప్రమాదానికి కారణం

ఒడిశా రైలు దుర్ఘటనకు రాంగ్ సిగ్నలింగే కారణమని విచారణ కమిటీ తేల్చేసింది. గత నెలలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై నివేదిక ఇచ్చింది. అనేక స్థాయిల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించిన రైల్వే సేఫ్టీ కమిషన్.. తన దర్యాప్తు నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. గతంలో ఇదే తరహాలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని ఉంటే ఘోరం తప్పేదని తెలిపింది. రాంగ్ వైరింగ్, రాంగ్ కేబుల్ వల్ల 2022 మే 16న ఇదే తరహా దుర్ఘటన ఖరగ్‌పూర్ డివిజన్‌లో చోటుచేసుకుందని నివేదికలో పేర్కొంది. సిగ్నలింగ్, సర్క్యూట్ మార్పులో లోపాలే ఒడిషా రైలు ప్రమాదానికి అసలు కారణమని రైల్వే సేఫ్టీ కమిషన్ తేల్చింది.
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జూన్ 2న రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లు ఢీకొట్టాయి. ఈ ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా పెను విషాదం నింపింది. రైలు దుర్ఘటనలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై కుట్ర కోణం ఆరోపణలు రావడంతో సీబీఐ సైతం రంగంలోకి దిగింది. రైల్వే బోర్డు సిఫారసు మేరకు దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే, తొలుత రైల్వే సేఫ్టీ కమిషన్ విచారణను పూర్తి చేసి నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. సీబీఐ ఏంతేలుస్తుంది. విచారణ కమిటీ నివేదికతో ఏకీభవిస్తుందా? మరేదైనా కొత్త కోణం వెలికి తీస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com