న్యూయార్క్‌లో నిర్వహించిన యోగాకి గిన్నిస్‌ రికార్డ్

న్యూయార్క్‌లో నిర్వహించిన యోగాకి గిన్నిస్‌  రికార్డ్
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన యోగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటుదక్కించుకుంది.

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన యోగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటుదక్కించుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో న్యూయార్క్‌ యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక దేశాలకు చెందిన ప్రతినిధులు భాగస్వామ్యం కావడంతో ఈ రికార్డు నమోదైంది. యోగా ఏ ఒక్క దేశం, మతం, వర్గానికి చెందింది కాదని ఈ సందర్భంగా మోదీ అన్నారు. దీనికి ఎలాంటి కాపీరైట్‌, పేటెంట్‌, రాయల్టీలు లేవని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలతోపాటు 180 దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. న్యూయార్క్‌ మేయర్‌, మూడుసార్లు గ్రామీ అవార్డు గ్రహీత రికీ కెజ్‌, గాయని ఫాల్గుణి షా, నటులు రిచర్డ్‌ గేర్‌, ప్రియాంక చోప్రాతో పాటు ఐక్యరాజ్య సమితి అధికారులు భాగస్వాములయ్యారు.

వివిద దేశాలను నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చారని మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తొమ్మిదేళ్ల క్రితం ఇక్కడనుంచే ప్రతిపాదించానన్నారు. యావత్‌ ప్రపంచం దీనికి మద్దతు పలకడం సంతోషంగా ఉందని చెప్పారు. యోగా భారత్‌ నుంచి వచ్చిందని దీనికి అత్యంత ప్రాచీన చరిత్ర ఉందన్నారు. అన్ని ప్రాచీన సంప్రదాయాల మాదిరిగానే ఇది కూడా సజీవమైనదన్నారు.

మరోవైపు గుజరాత్‌లోని సూరత్‌లోనూ సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. ఒకేచోట 1.53లక్షల మందితో నిర్వహించిన యోగా సెషన్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. అంతకముందు 2018లో రాజస్థాన్‌లోని కోటలో లక్షా 984 మందితో నిర్వహించిన యోగా సెషన్‌ రికార్డును ఇది తిరిగరాసినట్టయింది.

Tags

Next Story