ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 292కి చేరిన మృతులు - Live Updates
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 292కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడ్డారు. నిన్న రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు.... ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. ట్రాక్‌పై పడిన ‘కోరమాండల్’ బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ముందుగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో మొత్తం 13 బోగీలు మరో ట్రాక్‌పై పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికి పక్క ట్రాక్‌పై వస్తోన్న యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు ‘కోరమాండల్’ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలులో నాలుగు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఈ మేరకు రైల్వే అధికారులు.. అధికారిక ప్రకటన చేశారు. గాయపడిన వారిలో కొందరి పరిస్ఖితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను మళ్లించినట్టు అధికారులు వెల్లడించారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్........ షాలిమార్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించేందుకు పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లను పంపారు. దాదాపు వందకుపైగా అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించాయి. బాలాసోర్ లోని ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు. అలాగే, బాలేశ్వర్‌లోని వైద్య కళాశాలలు, ఆస్పత్రులను అధికారులు అప్రమత్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. చనిపోయినవారికి 10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి 50వేలు చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. అటు....ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇవాళ అక్కడికి వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం మృతుల కుటుంబాలకు తరుపున 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
Live Updates
- 3 Jun 2023 10:28 AM GMT
ప్రమాద స్థలికి చేరుకున్న ప్రధాని
ఒడిశాలోని రైలు ప్రమాద స్థలికి చేరుకున్నారు ప్రధాని మోదీ. రైల్వే మంత్రితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం కటక్ ఆస్పత్రికి వెళ్లనున్నారు మోదీ. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలతో పాటు ప్రమాద తీవ్రతపై ఆరా తీయనున్నారు మోదీ.
- 3 Jun 2023 9:50 AM GMT
సురక్షితంగా బయటపడిన ప్రయాణికులను స్వరాష్ట్రాలకు తరలిస్తున్న అధికారులు
ఒడిశా రైలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రయాణికులను స్వరాష్ట్రాలకు తరలిస్తున్నారు అధికారులు. 190మంది ప్రయాణికులతో బధ్రక్ నుంచి ప్రత్యేక ట్రైన్ చెన్నైకి బయల్దేరింది. కాసేపట్లో స్పెషల్ ట్రైన్ విశాఖ చేరుకోనుంది. ఇందులో ఏపీ ప్రజలు కూడా ఉన్నారు. ఉదయం 8గంటల 45 నిమిషాలకు8 బయల్దేరిన రైలు.. రాత్రి 9 గంటలకు చెన్నై చేరుకుంటుందని అధికారులు తెలిపారు. బరంపురంలో నలుగురు, విశాఖలో 41 మంది, రాజమండ్రిలో ఒక ప్రయాణికుడు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక తాడేపల్లిగూడెంలో ఇద్దరు, బెజవాడలో 9మంది, చెన్నైలో 133 మంది ప్రయాణికులు దిగనున్నారు.
- 3 Jun 2023 6:33 AM GMT
నిలిచిపోయిన 17 రైల్లు
ఒడిశా ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్‌లో 17 ట్రైన్స్ నిలిచిపోయాయి. 11 రైళ్లను దారి మళ్లించారు. ఇందులో విజయనగరం మీదుగా ప్రయాణించే నాలుగు ట్రైన్స్‌తో పాటు మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జిల్లా గుండా ప్రయాణించడంతో స్థానిక రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు.
- 3 Jun 2023 6:00 AM GMT
రైలులో 120 మంది తెలుగు ప్రయాణికులు..!?
ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు 120 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.ప్రమాదం నేపథ్యంలో వారి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.హెల్స్ లైన్ నంబర్లకు భారీగా కాల్స్ వస్తున్నాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం పది గంటలకు విజయవాడ చేరాల్సి ఉండగా.. ఇంతలోనే ఈ ఘోరం జరుగడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
- 3 Jun 2023 5:57 AM GMT
సహాయ చర్యల్లో వైమానిక దళం
ప్రమాదస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.సహాయ చర్యల్లో వైమానిక దళం పాల్గొంటుంది. రెస్క్యూ,ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ కోసం ఎయిర్‌ఫోర్స్ సేవలు అందిస్తోంది. అంబులెన్సులు, వైద్యబృందాలు ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.రైలు బోగీల్లో చిక్కుకుపోయిన క్షతగాత్రులను సురక్షితంగా వెలికి తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం బీతావహంగా మారింది. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ పలు జంక్షన్ల కేంద్రాలుగా హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసింది. గాయపడ్డ వారిని బాలాసోర్ మెడికల్ కాలేజీకి, సోరో, గోపాల్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఖాంతపాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
- 3 Jun 2023 5:30 AM GMT
క్షతగాత్రుల సేవలో టీడీపీ
ఒడిశాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం దురదృష్టకరమని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. క్షతగాత్రులకు సహాయసహకారాలు అందించడానికి టీడీపీ తరపున ఎమ్మెల్యే బెందాలం అశోక్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను నియమించడం జరిగిందని చెప్పారు. వీరిరువురు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ సహకారాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ శ్రేణులు క్షతగాత్రులకు సహాయం చేసేందుకు ముందుకురావాలని అచ్చెన్నాయుడు కార్యకర్తలను కోరారు. నాయకుడి ఆదేశాలతో క్షతగాత్రులకు సహాయం చేసేందుకు ఘటనా స్థలానికి తరలి వెళ్లారు టీడీపీ కార్యకర్తలు. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడం దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద దుర్ఘటన.
- 3 Jun 2023 5:07 AM GMT
చనిపోయినవారికి 10లక్షలు ప్రకటించిన కేంద్రం
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. చనిపోయినవారికి 10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి 50వేలు చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. అటు....ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇవాళ అక్కడికి వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం మృతుల కుటుంబాలకు తరుపున 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించాయి. బాలాసోర్ లోని ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు. అలాగే, బాలేశ్వర్‌లోని వైద్య కళాశాలలు, ఆస్పత్రులను అధికారులు అప్రమత్తం చేశారు.
- 3 Jun 2023 5:06 AM GMT
క్షతగాత్రుల ఆర్తనాదాలు
రైల్వే ట్రాక్ పైనే ఇంకా.. మృత దేహాలు..క్షతగాత్రుల ఆర్తనాదాలు.. ఎటు చూసిన ఇవే దృశ్యాలు.అసలు ఏం జరిగిందో ఎవరికి క్లారిటీ లేదు..రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నుజ్జు నుజ్జు అయిన రైల్వే భోగీల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.అయితే నిన్న రాత్రి యశ్వంత్ పూర్ - హౌరా ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలు తప్పింది. పక్కనే ఉన్న ట్రాక్ పై భోగీలు పడ్డాయి అదే సమయంలో వ్యతిరేక దిశలో వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొంది.
- 3 Jun 2023 5:04 AM GMT
ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు
రైల్వే శాఖ అధికారులు ఒడిశా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాల నుంచి నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నప్పటికీ అధికారులు.. గాయపడిన వివరాలు అందించలేని పరిస్థితి ఉంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో తమ రాష్ట్రానికి చెందిన వారు ఉండటంతో పశ్చిమ్‌బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రైలు ప్రమాదం జరిగిన ఒడిశాలోని అధికారులతో మిగిలిన 3 రాష్ట్రాల అధికారులు సంప్రదిస్తున్నారు. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించినట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.
- 3 Jun 2023 5:03 AM GMT
రైలు ప్రమాదం నాలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది
ఒడిశా రైలు దుర్ఘటన నాలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. పశ్చిమ్‌బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు ఘోర ప్రమాదానికి గురికావడంతో పెను విషాదం నింపింది. సుదీర్ఘ ప్రయాణం సాగించే రైలు కావడం, రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో క్షతగాత్రులు, మృతుల వివరాలు తెలియడం లేదు. కోరమాండల్ రైల్లో ప్రయాణించిన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 238 మంది మృతి చెందడం, 800 మందికి పైగా గాయపడటంతో ప్రయాణికుల వివరాలు వెల్లడించడం కూడా రైల్వేశాఖ అధికారులకు కష్టతరంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com