AB de Villiers : ఆర్‌సీబీ కెప్టెన్‌గా డుప్లెసిస్‌ను కొనసాగించాలి : ఏబీ డివిలియర్స్

ఐపీఎల్‌లో అత్యంత క్రేజ్ ఉన్న జట్టుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. వచ్చే సీజన్ దీని కెప్టెన్‌గా ఎవరు ఉంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మను తీసుకుని సారథిగా నియమిస్తారని అభిమానుల్లో చర్చ మొదలైంది. తాజాగా రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. ముంబయి నుంచి ఆర్‌టీఎం రూల్‌తో రోహిత్‌ను ఆర్‌సీబీ తీసుకుంటుందని కథనాలు వచ్చాయి. కానీ, వాటన్నింటినీ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కొట్టిపడేశాడు. ఫాఫ్ డుప్లెసిస్‌ను తమ వద్దే ఉంచుకుని సారథ్య బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ‘అందరూ వయసు ఎక్కువైపోయిందని చెబుతున్నారు. అసలు ఫాప్ డుప్లెసిస్ 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఓ సమస్యగా చూస్తున్నారు. ఏజ్ అనేది ఓ నంబర్ మాత్రమే. ఇప్పటికీ అతడు ఫిట్‌నెస్ విషయంలో అద్భుతం. మరికొన్ని సీజన్లపాటు ఆడే అవకాశం ఉంది. ఆర్‌సీబీ కెప్టెన్‌గా అతడు ఒక్కసారి కూడా కప్‌ను అందించలేదు. అదొక్కటే అతడిపై ఒత్తిడి చూపే అంశం. విరాట్ కోహ్లీ కూడా ఫాఫ్‌కు అండగా నిలుస్తాడని భావిస్తున్నా. అతడు కొనసాగడం కోహ్లీకి ఇష్టమే. అసలు రోహిత్ ఇక్కడకి వస్తాడని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు నాకు నవ్వు తెప్పించాయి. ఒకవేళ రోహిత్ ముంబయి నుంచి ఆర్‌సీబీకి వస్తే అద్భుతమే. నాకు తెలిసి అలాంటిదేమీ ఉండకపోవచ్చు. కనీసం 0.1 శాతం కూడా జరగదని బలంగా చెప్పగలను’ అని ఏబీడీ వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com